నూతన పారిశ్రామిక విధానం అంటే పాత విధానం కంటే మెరుగ్గా ఉండాలి? పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు పోటీ పడాలి. అంతేకాని గతంలో ఉన్న రాయితీలకే మంగళం పాడితే ఇక ఏపీలో పెట్టుబడులు ఎవరు పెడతారు. సరిగ్గా అలాగే ఉంది. ఏపీ నూతన పారిశ్రామిక విధానం.
గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమలు పెట్టుకోవడానికి భూమిని కేటాయిస్తే దాని ధరలో 50 శాతం రాయితీ ఇచ్చేవారు. పాత విధానంలో ఈ సౌకర్యం గతంలో ఎస్సీ, ఎస్టీలకే ఉండేది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాయితీలకు బీసీలకు కూడా వర్తింపజేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎట్టకేలకు సంవత్సరం 3 నెలల తరవాత నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు. అయితే ఇది ఎవరినీ ఆకర్షించలేకపోయింది. రాయితీలు ఎత్తివేయడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం భూ యితీలు ఎత్తివేయడంతో ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో కనీసం కుటీర పరిశ్రమ కూడా పెట్టుకోలేమని వారు పెదవి విరుస్తున్నారు.
మరోవైపు మహిళలకు గతంలో ఉన్న 50 శాతం పెట్టుబడి రాయితీని 35 శాతానికి తగ్గించారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పెట్టుబడి రాయితీని 15 శాతానికి పరిమితం చేశారు. గతంలో ఈ వర్గాలకు పెట్టుబడి రాయితీ 35 శాతం ఉంది. రాయితీల్లో భారీగా కోత వేయడంతో ఇక పరిశ్రమలకు పెట్టడం, వాటిని నడపడం సాధ్యం కాదని బడుగులు పదవి విరుస్తున్నారు.
రాయితీలు చెల్లించే విషయంలోనూ ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. పరిశ్రమలు 80 శాతం లక్ష్యాన్ని అందుకుంటే మూడేళ్ల తరవాత రాయితీ చెల్లించనున్నారు. సాధారణంగా పరిశ్రమల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం మూడేళ్లు నడిపిన తరవాత రాయితీలు చెల్లిస్తామంటే ఇక పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారనేదే అసలు ప్రశ్న.
పరిశ్రమలు పెట్టేవారు 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన కూడా పారిశ్రామికవేత్తల పాలిట శాపంగా మారింది. నిపుణులను పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం ఇవ్వందిగా మారిందని ఇప్పటికే పలు పరిశ్రమలు తెలంగాణ, తమిళనాడుకు తరలిపోతున్నాయి.
గతంలో ఆయా పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులపై ప్రభుత్వం వసూలు చేసిన పన్నులను మొదటి ఐదు సంవత్సరాలు తిరిగి వారికే చెల్లించేవి. అంటే పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేవనే చెప్పుకోవచ్చు. మొదటగా వారు పన్నులు చెల్లించినా వారు ఎంత మొత్తం చెల్లించారో ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం రాయితీల రూపంలో తిరిగి వారి ఖాతాలో వేసేవారు. ప్రస్తుత విధానంలో పన్ను రాయితీలకు మంగళం పాడారు.
పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఏపీ మాత్రం ఉన్న రాయితీలు ఎత్తివేసి పరిశ్రమలు పెట్టాలనుకునే ఔత్సాహికుల ఆశలపై నీరు చల్లిందనే చెప్పుకోవచ్చు.