ఓ టీనేజ్ అమ్మాయి తన ఆవేదనను తెలుపుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ భూస్వామి మేనల్లుడికి వ్యతిరేకంగా బాలిక చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా పోలీసు అధికారి డాన్స్ చేయమన్నాడని ఆమె ఆరోపించారు. మహిళలను రాత్రి వేళ విచారణ చేయరాదనే విషయాన్ని కూడా పట్టించుకోని అధికారి 16 ఏళ్ళ ఆ బాలికను రాత్రి వేళ స్టేషన్ లో విచారణ చేయడమే గాక డాన్స్ చేయించడం సంచలనం రేపుతోంది. ఆ బాలిక తన కుటుంబంతో కలిసి గోవింద్ నగర్ లోని దబౌలి వెస్ట్ ప్రాంతంలో అద్దె ఇంటిలో నివసిస్తోంది. అమ్మాయి కుటుంబం చిన్న చిన్న పనులు చేస్తూ జీవనోపాధి పొందుతుంది.
తమ ఇంటి యజమాని మేనల్లుడు బాలికను వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ వారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ యజమాని కొన్ని రోజుల క్రితం తమను బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించారని ఆ కుటుంబం తెలిపింది. భూస్వామి మేనల్లుడు నిందితుడు అనుప్ యాదవ్ జూలై 26 న తమ ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేశాడని బాలిక తల్లి తెలిపింది. అతని ఆగడాలకు అడ్డే లేకుండా పోవడంతో తిరిగి ఆగస్టు 7 రాత్రి, మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తమ కుమార్తెను అతడు వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో గోవింద్ నగర్ ఇన్స్పెక్టర్ అనురాగ్ మిశ్రాను సంప్రదించినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తమ ముందు డాన్స్ చేయమని కోరాడని ఆమె మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్న గోవింద్ నగర్ సర్కిల్ ఆఫీసర్ వికాస్ కుమార్ పాండే ఇంటి విషయంలో ఇరువర్గాల మధ్య ఇప్పటికే వివాదం నెలకొందని వెల్లడించారు. ఆ బాలిక, తల్లి ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని స్పష్టం చేసిన ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ వీడియోని విడుదల చేసినట్లు తెలిపారు. కానీ మరింత లోతుగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.