ఏపీలో ఇసుక మాఫియా చెలరేగి పోతోంది. కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో ఇసుక మాఫియా మరల రంగంలోకి దిగింది. ఇసుకు రీచ్‌లకు 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్థులు ఎండ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకు తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ తాజా నిబంధనను అక్రమార్కులు వరంగా మార్చుకున్నారు. వరదకు అవనిగడ్డ లంక గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం సవరించిన నిబంధనలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఎండ్ల బండ్లలో తీసుకెళితే ఉచితమే కావడంతో పగటి పూట ఎండ్ల బండ్లు, రాత్రి కాగానే ట్రాక్టర్లను రంగంలోకి దింపుతున్నారు. దీంతో అవనిగడ్డ లంక గ్రామాలైన ఎడ్లంక, దక్షిణ చిరువోల్లంక గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు తుంగలో తొక్కేశారు
అవనిగడ్డ సమీపంలోని ఐదు మండలాలు కోస్టర్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వస్తాయి. దీంతో అక్కడ ఎలాంటి తవ్వకాలకు అనుమతులు ఇవ్వరు. ఎండ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తరలించుకోవచ్చనే ప్రభుత్వ నిబంధన కూడా ఇక్కడ వర్తించదు. అయినా అధికార పార్టీ నేతల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఎండ్లబండ్లలో కొంత దూరం తరలించి తరవాత ఆ ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లో విజయవాడకు తరలిస్తున్నారని ఎడ్లంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
కోతకు గురవుతున్న లంక భూములు
అవనిగడ్డ, చల్లపల్లి లంక గ్రామాల్లో ఎడాపెడా ఇసుక తవ్వకాలు జరపడంతో లంక భూములు కోతకు గురవుతున్నాయి. 30 లంక గ్రామాల ప్రజలు వరద పోటుకు ఏటా నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను కోస్టర్ రెగ్యులేటరీ జోన్ నిషేధించినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. ప్రతి రోజూ 200 ట్రాక్టర్ల ఇసుకను విజయవాడ, తెనాలి, గుంటూరు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కళ్ల ముందే ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
అధికారులేమంటున్నారంటే..
ఎడ్లంక, దక్షిణ చిరువోల్లంక లంక గ్రామాల రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఇసుకాసురులను మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇసుక అక్రమార్కుల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలతో లంక భూములు కోతకు గురికావడంతో పాటు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.