బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కన్నడ పరిశ్రమ శాండిల్ వుడ్ లోనూ డ్రగ్స్ కలకలం రేపింది. దీంతో బెంగళూరు పోలీసులు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. పక్కా సమాచారంతో స్టార్ హీరోయిన్ రాగిణీ దివ్యేదిని నార్కోటిక్స్ బృందం అరెస్ట్ చేసింది. దీంతో శాండిల్ వుడ్ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆమెకు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ నటి నివేదిత ఓ అడుగు ముందుకేసి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇబ్బందులలోకి నెట్టింది.
గంజాయి చాలా మంచిదని వ్యాఖ్యానించిన నివేదిత గంజాయిని మన దేశంలో చట్టబద్దం చేయాలని డిమాండ్ చేశారు. గంజాయిని పవిత్రమైన తులసి మొక్కతో పోల్చిన ఆమె ఆయుర్వేద వైద్యంలో ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇలాంటి గంజాయిని తీసుకోవడంలో తప్పేమి లేదని నివేదిత చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. నివేదితకు గంజాయి అలవాటు ఉందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ఈ కామెంట్స్ ను తప్పుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.











