అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రెండు రోజుల్లో రూ.వందకోట్ల విరాళాలు వచ్చినట్టు సమాచారం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ భూమిపూజ చేసి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. 39 నెలల్లో నిర్మాణం కానున్న రామమందిరం కోసం.. జనవరి 15న విరాళాల సేకరణ కార్యక్రమం మొదలైంది. ఫిబ్రవరి 27న ముగియనుంది. కాగా ఈ రామమందిర నిర్మాణానికి రూ.1100కోట్లు వ్యయం అవుతుందని అంచనా. సుధీర్ఘ కాలం తరువాత దేశ సర్వోన్నత న్యాయస్థానం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
హిందువులందరినీ భాగస్వామ్యం చేయాలనే..
ఈ నిర్మాణ బాధ్యతలను చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు రెండు రోజుల్లో రూ.వంద కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. ఇంకా అధికారికంగా రసీదులు రావాల్సి ఉందన్నారు. ఆలయ నిర్మాణ ఇప్పటికే ప్రారంభమైందని, మూడు సంవత్సరాల్లో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. దేశ విదేశాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు ప్రకటిస్తుండడం పట్ల చంపత్ రాయ్ హర్షం వ్యక్తం చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో హిందువులందరినీ భాగస్వామ్యం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావించిందని, ఆ మేరకు దేశంలోని ప్రతి కుటుంబం నుంచి విరాళాలు సేకరిస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.
Must Read ;- సూరిబాబు.. రాములోరికి బలిపశువు ఎలా అయ్యాడంటే..
రాష్ట్రపతి రూ. 5 లక్షల విరాళం
తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం తలెత్తింది. ఈ వివాదంపై చంపత్ రాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయుడని, భారతీయ ఆత్మ శ్రీరామచంద్రుడని అన్నారు. ఈ గొప్ప లక్ష్యం కోసం విరాళం ఇవ్వడాన్ని ఎలా వివాదం చేస్తారని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం 39 నెలల్లో పూర్తవుతుందని, బహుశా 2024కు ముందే పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక నిధుల సేకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా 13కోట్ల కుటుంబాల్లోని రామ భక్తులను కలిసి విరాళాల సేకరణకు వీహెచ్‌పీ సిద్ధమైంది. ఇందు కోసం 5లక్షల మంది కార్యకర్తలతో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో వీహెచ్‌పీ ప్రకటించింది.
రూ.11కోట్లు విరాళమిచ్చిన వజ్రాల వ్యాపారి
ఇక గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి రామమందిరం నిర్మాణం కోసం రూ.11కోట్లు విరాళంగా ఇవ్వగా, హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన నెల వేతనాన్ని అయోధ్య ట్రస్టుకు విరాళంగా ప్రకటించారు. శనివారం తనను కలిసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు రూ. 1,83,750ల డీడీని అందజేశారు. వైసీపీ ఎంపీ తన మూడు నెలల వేతనం రూ.3.9లక్షలతోపాటు భక్తులు ఇచ్చిన మరో రూ.1,11,111 విరాళంగా ప్రకటించారు. రామాలయానికి ఎంత విరాళం ఇచ్చామనేది ముఖ్యం కాదని, భక్తికి సంబంధించిన అంశమని, ఎవరికి సాధ్యమైనంత వారు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. తాను కూడా విరాళం ఇచ్చినట్లు ప్రకటించారు.
మూడో అతిపెద్ద హిందూ దేవాలయం
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామమందిరం ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో.. కంబోడియాలోని అంగోకర్‌వాట్ ఆలయం మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది.
ప్రత్యేకతలు ఇవీ..
అయోధ్యలో 5 గోపురాలతో, 69 ఎకరాల్లో, 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఆలయంలో గర్భగుడి పైకప్పును వెండితో ఏర్పాటు చేయనున్నారు. 270- 280 అడుగుల వెడల్పు, 268-300 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా, ప్రాంగణంలో లక్షమంది భక్తులు పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా నిర్మించనున్న విషయం తెలిసిందే.
Must Read ;- నెలరోజుల్లోగా కొత్త కోదండరామాలయం నిర్మాణం