దుర్గగుడిలో రూ.12 కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి 16 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. విజయవాడ దుర్గగుడిలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు. ఇంత భారీగా తనిఖీలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. దుర్గమ్మ దర్శనం కోసం నకిలీ టిక్కెట్లు అమ్మడం, విలువైన చీరెలు కాజేయడం, షాపుల టెండర్లు, పార్కింగ్, ప్రసాదాల తయారీ, పంపిణీ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవినీతి చోటు చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. చివరకు కేశాలు, తుక్కును కూడా వదల్లేదని తెలుస్తోంది. గడచిన 20 నెలల కాలంలోనే దాదాపు రూ.12 కోట్ల కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ అవినీతి వ్యవహారం మొత్తం దుర్గగుడి ఈవో సురేష్ బాబు కేంద్రంగా జరిగినట్టు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించారు. తాజాగా ఇవాళ ఆరుగురు సూపరింటెంట్లు సహా 16 మంది సిబ్బందిని సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది.
16 మంది ఉద్యోగులు సస్పెన్షన్
దుర్గగుడి అవినీతి కేసులో 16 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరుగురు సూపరిండెంట్లు సహా మొత్తం 16మందిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అసలు దోషులను వదలి కింది స్థాయి సిబ్బందిని బలిచేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దుర్గగుడి అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవోను వదిలేసి, కింది స్థాయి సిబ్బందిని బలిచేయడంతో మంత్రి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో సురేష్ బాబు గతంలోనూ ఇదే తంతు కొనసాగించారని తెలుస్తోంది. ఏ దేవాలయంలో పనిచేసినా అవినీతిని తారస్థాయికి తీసుకువెళతారని ఆయనకు పేరుంది. సురేష్ బాబుకు దుర్గగుడి ఈవో అయ్యే అవకాశం లేకపోయినా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి ఈ పోస్టులోకి వచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. సురేష్ బాబు వచ్చినప్పటి నుంచి దుర్గగుడిలో అవినీతి పెద్దఎత్తున ప్రారంభమైంది. ఇక కరోనా సమయంలోనూ కేవలం రూ.300, రూ.500 టిక్కెట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఒకే టికెట్‌ను పలుమార్లు అమ్మడం, నకిలీ టిక్కెట్లు ముద్రించడం ద్వారా దుర్గగుడికి రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈవో సురేష్ కేంద్రంగానే ఈ వ్యవహారం మొత్తం నడిచిందని వారు గుర్తించారు. దీనిపై రిపోర్టును ఉన్నతాధికారులకు అందించారు.
శానిటేషన్‌లో అవినీతి కంపు
దసరా ఉత్సవాల పేరుతో భారీగా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో భక్తులు పెద్దగా లేకపోయినా శానిటేషన్ పేరుతో రూ.3 కోట్లు కొల్లగొట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. చివరకు తుక్కు అమ్మే విషయంలో ఎలాంటి టెండర్లు లేకుండా కోటిన్నర విలువైన తుక్కును కేవలం రూ15 లక్షలకే అమ్మేయడం వివాదంగా మారింది. దీనిపై కూడా ఏసీబీ అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. దుర్గగుడిలో రూ.5 లక్షల విలువైన ఏ పనికి అయినా టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. కానీ ఈవో సురేష్ నియమనిబంధనలు పాటించలేదని గుర్తించారు. ఉన్నతాధికారులు, మంత్రి వెల్లంపల్లి అండతోనే ఈవో సురేష్ చెలరేగిపోయారని తెలుస్తోంది.
వెల్లంపల్లికి వేటు తప్పదా?
ఏసీబీ తనిఖీలు ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వద్ద కూడా ఇంటిలిజెన్స్ రిపోర్టులో కూడా వెల్లంపల్లి అరాచకాలపై ఖచ్చితమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో మంత్రి వర్గ పునర్వవస్థీకరణ జరిగితే వెల్లంపల్లిని తప్పించేందుకే ఏసీబీ తనిఖీలు నిర్వహించి, అవినీతిని వెలికితీస్తున్నారని తెలుస్తోంది. దుర్గగుడిలో అవినీతికి కేవలం ఈవో సురేష్ ఒక్కడే కాకుండా, అతనికి మంత్రి అండదండలు కూడా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఇదే సాకులో మంత్రి వెల్లంపల్లిని త్వరలో తప్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. దుర్గగుడిలో తీవ్ర అవినీతి, అది కూడా దేవాదాయ శాఖ మంత్రి అండతో జరగడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శిలు గుప్పిస్తున్నాయి. వెల్లంపల్లిపై అవినీతి ఆరోపణలు ఎక్కువ కావడం, వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఏసీబీని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు తయారు చేసిన రిపోర్టు ఆధారంగా ఈవో సురేష్ బాబుపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంపల్లికి మూడినట్టేనా?