పద్నాలుగేళ్ళంటే .. ఇంకా కుర్రతనం పోని, పరిపక్వత పూర్తిగా రాని వయసు. ఎలాంటి బరువు, బాధ్యతలు లేకుండా.. అల్లరి చిల్లరిగా తిరిగే వయసు. కానీ అతడు మాత్రం ఆ వయసులో శాస్త్రీయ , పాశ్చాత్య సంగీతంలో ఆరితేరిపోయాడు. కీబోర్ట్ తోనూ, గిటార్ తోనూ ఆడుకుంటున్నాడు. పేరు సమర్ధ్ గొల్లపూడి. ఇతడి పేరు మీద యూట్యూబ్ లో ఓ ప్రత్యేక చానల్ కూడా ఉంది. ఆ వయసులో పాటలకు బాణీలు కట్టడం.. అదిరిపోయే ట్యూన్స్ తో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు ఈ కుర్రోడు.

అందుకే.. అతడి టాలెంట్ కు సరైన వేదిక టాలీవుడ్ అని భావించి.. సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు ప్రముఖ దర్శక, నిర్మాత యం.యస్.రాజు. సుమంత్ అశ్విన్ తొలిసారిగా నిర్మాతగా పరిచయమవుతూ, యం.యస్. రాజు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాకి సమర్ధ్ సంగీతం అందిస్తున్నాడు. అతి చిన్న వయసులో సంగీత దర్శకుడు అయిన వారి లిస్ట్ లోకి సమర్ధ్ గొల్లపూడి కూడా చేరాడు.
గతంలో అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీసాయి మహిమ’ సినిమాతో ప్రముఖ గాయని అనురాధ పడ్వాల్ తనయుడు .. ఆదిత్య పడ్వాల్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అప్పటికి అతడి వయసు 15 ఏళ్ళు. లాస్టియర్ కిడ్నీ సమస్య వల్ల ఆదిత్య కన్నుమూశాడు. తొలి చిత్రంతో అతడు అందించిన సంగీతం అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి.
ఇక సమర్ధ్ గొల్లపూడి ఈ సినిమానే కాకుండా.. మరో మూడు సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా అవకాశాలు అందుకున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా కూడా డర్టీ హరి తరహాలోనే యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న 7డేస్ 6 నైట్స్ సినిమా కి సమర్ధ్ ఏ రేంజ్ లో యూత్ ఫుల్ మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.
Must Read ;- ‘రాధే’ మెప్పుపొందిన రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్











