రాబోయే 6 నెలల్లో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. TCS, గూగుల్, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ సంస్థలు విశాఖలో త్వరలోనే క్యాంపస్‌లు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకూ ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో రూ.8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, డబ్ల్యూఎన్‌ఎస్, పాత్ర, కాండుయెంట్, ఫ్లూయంట్ గ్రిడ్, ఏసీఎన్, మిరాకిల్, టెక్ సర్వే, ప్రో విజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్ఠంగా 700 మందికి.. గరిష్ఠంగా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవికాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35 వేల మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటికి వస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, పుణె, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోతున్నారు. ఐటీ సంస్థలను విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి.
విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, క్లౌడ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ప్రభుత్వం మధురవాడలో 80 ఎకరాలు కేటాయించింది. సుమారు 10 వేల మంది విద్యార్థులకు AI, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్‌షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్స్, వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది.
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -CTS రూ.1,583 కోట్ల పెట్టుబడితో విశాఖలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాలను 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేయనుంది.
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – TCS రూ.1,370 కోట్లు పెట్టుబడి పెట్టి 12 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం ఐటీ హిల్-3లో 22 ఎకరాలను 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. సొంత భవనాలు నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్-2లో భవనాన్ని టీసీఎస్‌కు సబ్‌లీజుకు ఇచ్చేందుకూ అనుమతించింది.
విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు రూ.5,278 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఉర్సా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సంస్థకు ప్రభుత్వం కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున..ఐటీ హిల్-3లో 3.5 ఎకరాలను ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించింది.











