వైఎస్సార్ ఫ్యామిలీ ఆస్తుల రోజుకో మలుపు తిరుగుతోంది. బెంగుళూరు యలహంకలోని సువిశాల కాంపౌండ్‌లో వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుక జరపడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ఇల్లు మాది.. అక్కడ ఎలాంటి శుభకార్యం లేదా వేడుక జరగడానికి వీల్లేదంటూ జగన్ అత్తగారు, భార్య భారతి రెడ్డి ఫ్యామిలీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించే దిశగా వారు ఆలోచన చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
గత కొద్దిరోజులుగా వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి విషయంలో జగన్ వర్గం, వైసీపీ నేతలు భద్రతాపరమైన కారాణాలను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్‌కు, పెళ్లికి వచ్చే కేటరర్లు, డిజైనర్లు, సందర్శకుల వల్ల భద్రతా ముప్పు ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ప్రచారం చేస్తోంది. అయితే, ఇది కేవలం సాకు మాత్రమేనని, అసలు కథ వేరే ఉందనేది బంధువర్గాల ఆరోపణ.
యలహంకలోని 20 ఎకరాల విస్తరణలో జగన్, షర్మిల ఇళ్లు పక్కపక్కనే వేర్వేరు ప్రహరీ గోడలతో ఉన్నాయి. ఒకే కాంపౌండ్‌లో పక్క ఇంట్లో జరిగే మేనకోడలి పెళ్లికి తాను హాజరుకాకపోతే సమాజంలో అప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సి వస్తుందనే భావనతోనే, వేదికను వేరే చోటికి మార్పించేందుకు ఈ భద్రతా సాకులు చెబుతున్నారని బంధువులు మండిపడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఆస్తి, నివాస హక్కుల అంశాలను ముందుంచి, ఆ ఆవరణలో వేడుక జరగకుండా అడ్డుకునేందుకు వైఎస్ భారతి, ఆమె తల్లి పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తిపై మాకు హక్కులు ఉన్నాయి..మా అనుమతి లేనిదే అక్కడ అంత పెద్ద వేడుక నిర్వహించడానికి వీల్లేదనే కోణంలో న్యాయపోరాటానికి దిగేందుకు ప్రాథమిక ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
తల్లి విజయమ్మతో పాటు బంధువులంతా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జగన్ మరియు ఆయన కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఇంట్లో మేనకోడలి పెళ్లి జరుగుతుంటే ఆశీర్వదించాల్సింది పోయి, కోర్టు మెట్లు ఎక్కే స్థాయికి వివాదాన్ని తీసుకెళ్లడం ఏంటని YSR కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న కాలంలో ఇంట్లోనే ఎన్నో శుభకార్యాలు జరిగాయని, ఫ్యాక్షన్ ముప్పు ఉన్నప్పటికీ ఆయన ఏనాడు ఇలాంటి వైఖరి తీసుకోలేదని బంధువులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి, మేనకోడలి పెళ్లి వేదిక వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధికి చేరే సూచనలు కనిపిస్తుండటం వైఎస్ అభిమానులు షాక్ అవుతున్నారు.











