పట్టణ పేదలకు అత్యాధునికమైన సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా గతంలో నిలిచిపోయిన టిడ్కో ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం శరవేగంగా పట్టాలెక్కించింది. వైసీపీ హయాంలో పాడుబెట్టిన గృహ నిర్మాణాలపై 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే పనులన్నీ పూర్తి చేసింది. కనీస మౌలిక వసతులైన సిమెంట్ రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను కల్పించి ఏకంగా 1.08 లక్షల ఇళ్లను సిద్ధం చేసింది. ఈ ఏడాది మార్చిలోనే లబ్ధిదారులకు ఈ ఇళ్లను అప్పగించి వైభవంగా గృహప్రవేశాలు చేయించగా, డిసెంబరు నాటికి మరో 80 వేల గృహాలను పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేసింది.
అసలు ఈ టిడ్కో ప్రాజెక్టు పునాదులు 2014-19 మధ్య నాటి TDP ప్రభుత్వ హయాంలో పడ్డాయి. పట్టణ పేదల కోసం షియర్వాల్ సాంకేతికతతో, సకల సదుపాయాలతో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు నిర్మించాలని 3.13 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థల సేకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, మౌలిక వసతుల ప్రణాళికల వరకు అన్నీ పూర్తి చేసి 2017-19 మధ్య పనులను శరవేగంగా పరిగెత్తించారు. 2019 ఎన్నికల నాటికే 81,040 ఇళ్లు 90 శాతం పనులు, మరో 71,488 ఇళ్లు 75 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. TDPకి మంచి పేరు వస్తుందనే నెపంతో తొలి రెండున్నరేళ్లు టిడ్కో ఇళ్ల వైపే చూడకపోవడంతో నిర్మాణాలు పిచ్చిమొక్కలు, చెదలతో పాడుబడిపోయాయి. వైసీపీ ప్రభుత్వం 25 శాతం పనులు పూర్తయిన 52 వేలకు పైగా ఇళ్లను ఏకంగా రద్దు చేయడమే కాకుండా, 31 వేల మంది అర్హులైన లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించింది. పైగా లబ్ధిదారులు తమ వాటా కింద చెల్లించిన రూ.172 కోట్ల డిపాజిట్లను తిరిగి ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. అంతటితో ఆగకుండా ఇళ్ల కేటాయింపు కోసం TDP హయాంలో కేటాయించిన 260.74 ఎకరాల భూమిని తనఖా పెట్టి రూ.386 కోట్ల అప్పు తెచ్చింది.
ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులకు తమ రంగులు పులిమి, క్రెడిట్ చోరీకి యత్నించింది. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండానే 1.42 లక్షల మందికి ఇళ్లు ఇచ్చినట్లు కాగితాల్లో లెక్కలు చూపించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఘోరంగా తయారైంది. అలాంటి అస్తవ్యస్త పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బడ్జెట్ నిధులు కేటాయించి పనులను క్రమబద్ధీకరించింది. ఫలితంగానే 21 నెలల స్వల్ప వ్యవధిలోనే 1.08 లక్షల మంది పేదలు తమ సొంతింట్లో అడుగుపెట్టేలా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.











