దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిన్న ఒకే రోజు 3 లక్షల 20 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. మరో వైపు ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఒకే రోజు 25 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలోనూ ఆక్సిజన్ కొరతతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. విజయవాడలోని సమగ్ర ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో పడకలు లేక కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిపోతున్నారు. ఇక మహారాష్ట్రలోని నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తెచ్చుకుంటేనే వైద్యం చేస్తామని డాక్టర్లు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆదేశించినా పరిస్థితి చక్కబడలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించక కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాణవాయువు అందక మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.
గాంధీ ఆసుపత్రిలో మృత్యు ఘంటికలు
గ్రేటర్ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చారు. అయితే అక్కడ కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన వారం రోజుల్లోనే గాంధీ ఆసుపత్రిలో 320 మంది కరోనా రోగులు చనిపోయారు. వీరిలో చాలా మంది ఆక్సిజన్ అందకే చనిపోయారని తెలుస్తోంది. చాలా మంది రోగులకు ఆక్సిజన్ అవసరం అయినా అందుబాటులో లేకపోవడంతో వారికి ఆక్సిజన్ అందించలేకపోతున్నారు. వందలాది మంది కరోనా రోగులు గాంధీ ఆసుపత్రికి వస్తున్నా కనీసం వారికి బెడ్ కేటాయించకపోవడంతో వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు, తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఆక్సిజన్ కొరత ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆక్సిజన్ లేకే సీరియస్ కేసులను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతంత మాత్రమే..
ఏపీలో కరోనా రోగులకు అరగంటలో బెడ్ కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారులను ఆదేశించారు. అయినా కరోనా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ప్రైవేటు ఆసుపత్రులకు తరలుతున్నారు. విజయవాడలోని 1200 పడకల సమగ్ర ఆసుపత్రిని కరోనా వైద్య కేంద్రంగా మార్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల రోగులు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆసుపత్రి పడకలు నిండిపోవడంతో, కొత్తగా వచ్చే రోగులను చేర్చుకోవడం లేదు. వచ్చే రోగులు ఎక్కవ, డిశ్చార్జీలు తక్కువగా ఉండటంతో బెడ్లు లభించడం లేదు. ఇక విజయవాడలోనే 20 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యం చేసేందుకు అనుమతించారు. అయితే ఆక్సిజన్ కొరతతో వారు కూడా రోగులను చేర్చుకోవడం లేదు. గుంటూరు, విజయవాడ నగరాల్లో కరోనా రోగులకు బెడ్లు దొరక్క తంటాలు పడుతున్నారు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్లే రోగులకు బెడ్లు కేటాయించడం లేదని తెలుస్తోంది. అయితే ఏపీలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని వైద్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
ప్రాణాలు నిలుపుతున్న విశాఖ స్టీల్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఆక్సిజన్ తయారీ కేంద్రం నుంచి ప్రతి రోజూ 107 టన్నుల ఆక్సిజన్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 107 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తరలించారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని ప్రధాని ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగలు పనిచేస్తున్నారు. ఇక దేశంలో బొకారో స్టీల్ ప్లాంటు నుంచి కూడా రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న ఆక్సిజన్ ఫ్లాంటులు ఇప్పుడు ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నాయి.
Must read;- వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్ రైలు