ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది. విద్యా వ్యవస్థలో పేద, ధనిక వర్గాల మధ్య ఉన్న తేడాలను తొలగించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా హక్కు చట్టం – RTE అమలుపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే అవకాశం ఉంది.
ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, నిపుణులు, స్టూడెంట్ పేరెంట్స్ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ నిబంధన అమలు చేయడంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత, ప్రభుత్వ నిబంధనలకు తగిన మార్పులు చేర్పులు చేయనున్నారు.
కొన్ని నిబంధనలను సవరించి, ఈ ఉచిత ప్రవేశాల విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అక్షరాస్యత రేటును పెంచేందుకు చేపట్టిన అక్షర ఆంధ్ర లాంటి పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల నిర్ణయం అమలైతే, అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్య అందుతుంది. పేదరికం వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర అమలు తీరుతెన్నులపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం వెలువడనుంది. ఏదేమైనప్పటికీ, విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.











