ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ దిగ్గజం హిందుస్తాన్ కోకాకోలా బెవరేజెస్ – HCCBL ఏపీలో పెట్టుబడులను రెట్టింపు చేస్తూ ఏకంగా రూ.1,127 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ భారీ పెట్టుబడితో ఉత్తరాంధ్రతో పాటు, రాయలసీమలో రెండు ప్రధాన ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా విజయనగరంలో రూ.842 కోట్ల వ్యయంతో సరికొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 18 మిలియన్ కేసుల ఉత్పత్తి సామర్థ్యంతో మూడు బాట్లింగ్ లైన్లతో ఈ ప్లాంటు రూపుదిద్దుకోనుంది. ఇందులో కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు, టెట్రాప్యాక్ ఉత్పత్తులు తయారవుతాయి.
అలాగే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో ఇప్పటికే ఉన్న యూనిట్‌ను రూ.285 కోట్లతో మరింత విస్తరించనున్నారు. ఈ విస్తరణ ద్వారా కోకాకోలా, థమ్స్అప్, స్ప్రైట్, ఫాంటా, లిమ్కా, కిన్లే వాటర్ వంటి 6 ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ రెండు కేంద్రాల ద్వారా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా కంపెనీ సప్లై చేయనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీకి భారీ ఎత్తున పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దిగ్గజ కంపెనీలు ఏపీకి రావడం ఖాయం.











