ఏపీ అభివృద్ధిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలతో విప్లవాత్మక అడుగులు వేశారు. గత ఏడు రోజుల వ్యవధిలోనే సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విశ్రాంతి లేకుండా అటు దిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర నిధులను సాధిస్తూనే, ఇటు గ్రామస్థాయి నుంచి గ్లోబల్ ప్రాజెక్టుల దాకా అనేక సంస్కరణలను అమలు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా, గ్రామీణ వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తుండటంతో పల్లెల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకు రూ.11,085 కోట్ల భారీ నిధులతో పల్లెపండగ 3.0 పథకాన్ని ప్రారంభించి ఏకంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి తోడు పెద్దలకు పట్టాభిషేకం పేరిట గత ప్రభుత్వ భూ అక్రమాలను తుడిచిపెడుతూ, నకిలీ సర్వే రాళ్లు, ఫొటోల భయాన్ని దూరం చేస్తూ రాజముద్రతో నూతన పాస్‌పుస్తకాల పంపిణీని చేపట్టారు. మార్చి నాటికి 51.91 లక్షల పాస్‌పుస్తకాలను అందించేలా నెలకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తూ భూ సమస్యల నివారణకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నారు.
కరువు సీమగా పేరొందిన రాయలసీమ దశ-దిశను మార్చేలా రూ.లక్ష కోట్ల ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య పెట్టుబడులతో రాయలసీమ రైజింగ్ – గ్లోబల్ హార్టికల్చరల్ హబ్ కు పునాది వేశారు. రిలయన్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాల భాగస్వామ్యంతో సీమను ప్రపంచస్థాయి ఫ్రూట్ బౌల్‌గా మార్చి, రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మరోవైపు గ్రామాల్లో ఆడబిడ్డల నీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడుతూ రూ.30 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ / అమరజీవి జలధార పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికీ కృష్ణా, గోదావరి రక్షిత జలాలను అందించే మహాయజ్ఞం చేపట్టారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని మోదీ, ఎనిమిది మంది మంత్రులతో వరుస భేటీలు జరిపి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి 6 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, తొలి విడతగా 3 లక్షల గృహ నిర్మాణ ప్యాకేజీ తుదిదశకు చేరుకుంది.











