వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం 13 జిల్లాలకు విస్తరించిన సమయంలోనే కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో ఉద్యమాన్ని అమరావతి రాజధాని గ్రామాలకు పరిమితం చేశారు. అప్పటి నుంచి అలుపెరగకుండా 29 గ్రామాల అమరావతి రాజధాని రైతులు నిత్యం ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి సరిగ్గా 500 రోజులకు చేరింది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతులు, ఐకాస నేతలు తేల్చి చెప్పారు. ఈ ఉద్యమంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది రైతులు పంటలు లేక మనోవేదనకు గురికావాల్సి వస్తోందని ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని గమనించి ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
లక్షమందితో విర్చువల్ సమావేశం
కరోనా సెకండ్ వేవ్ ఆంక్షల నేపధ్యంలో అమరావతి 500 రోజుల ఉద్యమాన్ని విర్చువల్ గా లక్ష మంది పాల్గొనేలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని అమరావతి ఐకాస నిర్ణయించింది. ఈ సమావేశంలో రాజధాని గ్రామల రైతులు, దళిత నేతలు, అమరావతి ఐకాస నేతలతోపాటు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటోన్న పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. అమరావతి రాజధాని 29 గ్రామాల పరిధిలో విర్చువల్ తెరలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. 29 గ్రామాలకు చెందిన వేలాది రైతులతోపాటు, రైతు సంఘాల నేతలు కూడా ఈ విర్చువల్ సమావేశంలో పాల్గొంటున్నారు. అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని అమరావతి రాజధాని ఐకాస ప్రకటించింది.
ఎన్నో అవమానాలు, లెక్కలేనన్ని కేసులు
అమరావతి రాజధాని రైతులపై, మహిళా రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సభ్య సమాజం నివ్వెరపోయేలా చేసింది. అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు సీరియస్ కావడంతో వారు కొంత వెనక్కు తగ్గారు. ఒక సమయంలో అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న గర్భణీపై మగ పోలీసులు కాలుతో తన్నుతూ తీసుకువెళ్లడం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక అమరావతి ఏకైక రాజధాని కావాలంటూ ఉద్యమం చేస్తున్న రైతులపై పోలీసులు పెట్టిన కేసులకు లెక్కే లేదు. చివరకు దళిత రైతులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారితీసింది. దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడంతోపాటు వారికి సంకెళ్లు వేసి జైలుకు తరలించడంలాంటి ప్రభుత్వ చర్యలతో దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు పోయింది.
రాక్షసానందం పొందుతున్నారు
అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. 29 గ్రామాల రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 33 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. రైతుల త్యాగాలు ఊరికే పోవని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని కొనసాగించి ఉంటే ఇప్పటికే ఏపీకి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవని, నేడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమంలో ఒప్పటికే 120 మంది రైతుల ప్రాణాలు కోల్పోయారని, మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల పొట్ట కొట్టారని ఆయన మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!