పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎంత హెచ్చరించినా కొన్ని దారుణాలు జరగకుండా అడ్డుకోలేకపోతున్నారు. అలాంటి దారుణమైన సంఘటన హైదరాబాద్ పాతబస్తిలో చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను.. 57 ఏళ్ల వయస్సుగల వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన మూడు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చేపట్టి.. విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం, బాలికను వివాహం చేసుకన్న నిందితుడు కేరళకు చెందిన అబ్దుల్ లతిఫ్‌గా గుర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్ లో నివసిస్తున్న లతిఫ్ దళారుల ద్వారా పాతబస్తీకి చెందిన మహ్మద్ గౌసుద్దీన్ కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాడు. బాలిక తండ్రి, సవతి తల్లికి 1.5 లక్షల ఆశ చూపించి బాలిక వివాహానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 27న బండ్లగూడలో జరిగిన ఈ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఇదే కాదు.. గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలకు పాతబస్తీ వేదికైంది. కేవలం మైనర్ వివాహాలేకాదు.. దుబాయ్, గల్ఫ్ దేశాల్లో వారు వివాహం పేరుతో పాతబస్తి యువతులను మోసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినా.. డబ్బుకు ఆశపడిన కొందరు తల్లిదండ్రులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టాలంటే.. ఆలస్యం చేయకుండా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే, తప్పక వారికి రక్షణ కల్పించి నిందుతులను శిక్షించడంతోపాటు.. అటువంటి తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.