ప్రపంచ తెరపై అద్భుతాలు చూపడానికీ .. ఆశ్చర్యచకితులను చేయడానికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ రెడీ అవుతోంది.ప్రపంచ సినిమా ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమా వచ్చేవరకూ అంతా దీని గురించే మాట్లాడుకునేలా, ఒక ప్రమోను వదిలారు. ఈ ప్రోమో ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ నుంచి ఇంతవరకూ ఎనిమిది సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో అనూహ్యమైన స్థాయిలో విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎఫ్ 9’ పేరుతో తొమ్మిదో సినిమాను వదలడానికి రంగం సిద్ధమవుతోంది. తాజాగా వదిలిన ప్రోమో చూస్తేనే ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేశారనేది అర్థమవుతోంది. తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రధానంగా సాగే యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయని చెబుతున్నారు.
జస్ట్ లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విన్ డీజిల్ .. మిచెల్ రోడ్రీ గెజ్ .. టైరెస్ గిబ్సన్ .. జాన్ సెనా .. హెలెన్ మిర్రెన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇంతకుముందు ప్రేక్షకులను విస్మయులను చేసిన ఎనిమిది సినిమాలకంటే, ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు చేశారట. కార్ ఛేజ్ లు .. బైక్ రేస్ లు .. స్పీడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఊపిరి బిగబట్టేలా చేస్తాయని చెబుతున్నారు. గతంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.