‘ఆహా’ ఓటీటీలో విడుదలైన సినిమా ‘మా వింతగాధ వినుమా’. రావోయి చందమామ పాటలోని పల్లవి నుంచి తీసుకున్న ఈ టైటిల్ తో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ కథ ఏమిటో, దాని వెనకున్న గాధ ఏమిటో తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
సిద్ధూ (సిద్ధు జొన్నలగడ్డ) కేర్ లెస్ కుర్రాడు. వినీత (సీరత్ కపూర్) మీద మనసు పారేసుకుంటాడు. ఆమె ప్రేమ కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తుంటాడు. ఎట్టకేలకు ఆమె ఓకే చెబుతుంది. ఆ తర్వాత సిద్దూతో కలిసి వినీత తన సోదరుడి (కమల్ కామరాజు) ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం గోవాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సిద్ధూ, వినీత తాగిన మత్తులో పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి వీడియో వైరల్ కావడం జరిగిపోతుంది.
దాని పర్యవసానంగా వీరిద్దరికీ బ్రేక్ అప్. వీరు విడిపోవడానికి కారణమేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే అసలు కథ. ఈ వైరల్ వీడియో ఈ సినిమాకే కొత్త కాదు. మొన్ననే విడుదలైన ‘లూడో’ చిత్రంలో ఇలాంటి అంశం ఉంది. ఓ వీడియో వైరల్ అయితే వారి జీవితాలు ఎలాంటి ఒడుదొడుకులకు లోనవుతాయన్నది ఇందులోని ప్రధాన అంశం.
ఎలా తీశారు? ఎలా చేశారు?
కథనంలో దర్శకుడి తడబాటు అడుగడుగునా కనిపిస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అంటే కేవలం బూతు మాటలే కాదని తెలుసుకుని ఉంటే బాగుండేది. కథనంలో బ్యలెన్స్ సరిగా లేదు. ఓటీటీని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన కథ కావడంతో బూతు ఉండాలని అనుకున్నారేమో తెలియదు. ఇందులో పెద్దగా లవ్వూ లేదు, నవ్వూ లేదు. ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
సిద్ధూ తన పాత్ర పరంగా బాగానే మెప్పించాడు, సీరత్ కపూర్ మాత్రం కాస్త అతి చేసినట్టు అనిపిస్తుంది. తనికెళ్ల భరణి మాత్రం పాత్రలో ఇమిడి నటించారు. మరో కామెడీ నటుడు హర్ష పాత్ర కూడా ఇందులో సరిగా పండలేదు. అతన్ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. కాలేజీలో ర్యాగింగ్ సన్నివేశాలు కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. కథనంలో వేగం లేకపోవడంతో సాగదీతగా అనిపిస్తుంది.
హైలైట్స్:
సంగీతం బాగుంది. ద్వీతీయార్థంలో వచ్చే పాట ఆకట్టుకునేలా ఉంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అనుకోవచ్చు. గ్లామర్ ఆంటీ ప్రగతి పాత్ర ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే తన పాత్రకు మించి ఆమె నటిస్తుంది కాబట్టి. కామెడీ ఉన్నా పెద్ద పీట వేయలేం. యూత్ టార్గెట్ గా చేసి రూపొందించినా ఎక్కడ యూత్ కనెక్ట్ కాలేరు.
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, తనికెళ్ల భరణి, ప్రగతి, జయప్రకాష్, కమల్ కామరాజు, కల్పిక, రాజేశ్వరి నాయర్, ఫిష్ వెంకట్.
రచన : సిద్ధు జొన్నలగడ్డ
ఎడిటింగ్: వంశీ అట్లూరి, సిద్ధు జొన్నలగడ్డ
కెమెరా : సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
నేపథ్య సంగీతం: రోహిత్ పసుపర్తి, జాయ్ రాయరాల
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లల, కీర్తి చిలుకూరి, జి. సునీత
దర్శకత్వం : అదిత్య మండల
విడుదల తేదీ : నవంబరు 13, 2020
వేదిక: ఆహా
ఒక్క మాటలో: ‘ఆహా’ కాదు హాహాకారాలు
రేటింగ్: 2/5
– హేమసుందర్ పామర్తి











