టాలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్స్ లో కృష్ణభగవాన్ ఒకరుగా కనిపిస్తాడు. కృష్ణభగవాన్ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్. వెటకారంతో కూడిన ఆయన డైలాగ్ డెలివరీని అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. తెరపై పెద్దగా హడావిడి చేయకుండా కూల్ గా పంచ్ లేస్తూ నవ్వించడం ఆయన ప్రత్యేకత. ఒకానొక దశలో ఆయన హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలాంటి కృష్ణభగవాన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వీతో కలిసి పాల్గొన్నాడు. తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు.
“మాది రైతు కుటుంబం .. కాకినాడలో చదువు పూర్తి చేశాను. మొదటి నుంచి కూడా సినిమాలపై ఆసక్తి ఉండేది. ఒక నాటకంలో నాకు వచ్చిన గుర్తింపు నన్ను నటన దిశగా నడిపించింది. దర్శకుడు వంశీ సినిమాలతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయన దర్శకత్వం వహించిన ‘మహర్షి’ సినిమాలో మంచి పాత్ర పడింది. ఆ తరువాత ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాకి ఆయనతో కలిసి పనిచేశాను. తెరపైనే కాదు .. బయట కూడా నాకు కొంచెం నోటిదూల ఎక్కువే. ఎవరైనా ఏదైనా అంటే, నాదైన స్టైల్లో పంచ్ లు వేస్తుంటాను.
ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశంతో కామెడీ చేయను .. సరదాగానే అలా మాట్లాడుతూ ఉంటాను. అలా మాట్లాడటం కొంతమందిని బాధపెట్టిందని ఆ తరువాత తెలుస్తూ ఉంటుంది. ఒక ఆర్టిస్టుగా గ్యాప్ రావడానికి కారణం .. నా అనారోగ్యం. కొంతకాలంగా కాలు నొప్పి ఇబ్బంది పెడుతోంది. అందువలన ఎక్కువగా నిలబడటం .. నడవడం చేయలేను. ఈ విషయం తెలిసి నాకు వేషాలు ఇవ్వడం మానేశారు. అలా గ్యాప్ అనేది వాళ్లు ఇవ్వడం .. నేను తీసుకోవడం రెండూ ఒక్కసారిగా జరిగిపోయాయనే అనుకోవాలి. వేషాలు ఇవ్వడం లేదనే బాధ నాకు లేదు .. భవిష్యత్తులో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనే ఆలోచన ఉంది” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- ‘బ్రహ్మానందా’ నందో బ్రహ్మ (బర్త్ డే స్పెషల్)











