ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీని ఎఫెక్ట్ తో సినీ రంగం మళ్ళీ సంక్షోభంలో పడింది. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకూ తమ షూటింగ్స్ ను నిలిపి వేశాయి. థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడో సినిమా చిత్రీకరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అవడం మరింత షాకింగ్ గా మారింది.
రజనీకాంత్ హీరోగా.. శివ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమా ‘అన్నాత్త’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే బ్యాలెన్స్ పార్ట్.. కరోనా పరిస్థితుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంటూండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుర్ర హీరోలే కరోనాకి భయపడి.. షూటింగ్స్ బంద్ చేసి ఇంట్లో కూర్చుంటే.. రజనీకాంత్ లాంటి వయసు మళ్ళిన హీరో.. సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఏంటనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ‘అన్నాత్త’ సినిమా సెట్స్ లో యూనిట్ తీసుకుంటున్న జాగ్రత్తలు తెలిస్తే.. ఎవరూ అలాంటి కామెంట్స్ చేయరేమో.
అన్నాత్త సినిమాను ఈ దీపావళికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో .. ప్రస్తుతం షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతున్నారు. అయితే సెట్స్ లో ఉన్న టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది వరకూ అందరూ.. పీపీఈ కిట్స్, మాస్క్ ధరించాలనే నిబంధన పెట్టుకున్నారట. సెట్స్ లోకి అడుగుపెట్టే ప్రతీ వారికీ టెంపరేచర్ చెక్ చేసి. బాడీ మొత్తం శానిటైజ్ చేస్తున్నారట. ఇక అందరూ రజనీకాంత్ కు ఎనిమిది అడుగుల దూరంలో ఉంటున్నారట. దర్శకుడు శివ మాత్రం సీన్ వివరించాలి కాబట్టి.. కొంచెం దగ్గర గా ఉంటున్నారట. షాట్ అయిన వెంటనే ఎవరి ప్లేస్ లోకి వారు వెళుతున్నారట.
మరో పదిరోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. మొత్తం మీద రజనీకాంత్ లాంటి సీనియర్ హీరోతో.. పక్కా ప్లానింగ్ తో , పెర్ఫెక్ట్ సేఫ్టీ మెజర్స్ తో ఈ విధంగా షూటింగ్ జరపడం .. అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. ఈ విధానంతో .. ఇప్పుడు ఎవరైనా తమ సినిమాల్నీ షూట్ చేసుకోవచ్చనే భరోసా నిచ్చారు. మరి రజనీ కాంత్ స్టైల్లోనే ఇంకా ఇతర హీరోలెవరైనా తమ సినిమాల షూటింగ్ ను మొదలు పెడతారేమో చూడాలి.
Must Read ;- ‘అనాత్తే’షూటింగ్ లో సూపర్ స్టార్ రజినీ










