నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని ‘లవ్ స్టోరీ’ చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో ఉంది. ముఖ్యంగా నాగ చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రికార్డుగా చెప్పాల్సి ఉంటుంది. కరోనాకి ముందు, ఇప్పుడు లెక్కల్లో కొంచెం అటూ ఇటూగా తేడాలు ఉండొచ్చేమోగానీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా 31. 2 కోట్లు బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిపి 26. 3 కోట్ల బిజినెస్ నమోదైంది. అలాగే ఓవర్సీస్ లో 2.8 కోట్ల బిజినెస్ జరిగింది.
ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు 50 కోట్లు అయినట్లు నిర్మాతలు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో నిర్మాతలే ఈ సినిమాని సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇక వసూళ్ల పరంగా కూడా సినిమా దూకుడు మీద ఉంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో మూడు రోజుల పాటు టిక్కెట్లన్నీ బుక్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం జోరుమీద ఉంది. సినిమా వర్గాల్లో ఈ సినిమా జోష్ ను నింపింది.
టాక్ విషయానికి వస్తే..
లవ్ స్టోరీ మొదటి ఆటలో కొంత డివైడ్ టాక్ వచ్చినా క్రమేపీ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ పత్రికలు, వెబ్ సైట్లలో యావరేజ్ రేటింగ్ 3 వరకూ ఉంది. ఇక ఐఎండీబీ అయితే ఏకంగా 10కి 8.9 రేటింగ్ ఇచ్చింది. ఇటీవల వచ్చిన అనేక సినిమాలతో పోలిస్తే ఇది మంచి రేటింగ్. ముఖ్యంగా యూత్ టార్గెట్ గా ఈ సినిమా రూపొందింది. అందుకే మల్టీప్లెక్స్ లు, నగరాల్లో కలెక్షన్ల స్పీడు ఎక్కువగా ఉంది. బి, సి. సెంటర్లతో పోలిస్తే మల్టీప్లెక్స్ లలో ఇంకా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ ఈ సినిమాను మరో మెట్టు పైన నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్ర పరిశ్రమకు ఈ సినిమా ఫలితం ఓ టానిక్ లాంటిది అని చెప్పాలి.
MUst Read ;- నాగ చైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ‘ (రివ్యూ)











