నేటి కాలంలో ఆన్ లైన్ మోసాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. సాధారణంగా ముక్కుమొహం తెలియని వారిని నమ్మి మన వ్యక్తిగత సమాచారం వారితో పంచుకోవడం అలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ మన ఇంట్లో వాళ్లే మనకు తెలియకుండా మన సమాచారం సేకరించి మనల్ని బెదిరిస్తే.. అలా ఎందుకు చేస్తారు అనకోకండి. అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అసలు వివరాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవకుండా ఉండలేరు.
10 కోట్లు కట్లు..
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అగంతకుడి నుంచి ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చదివిన అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే 10 కోట్లు ఇవ్వకపోతే.. మీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను నెట్లో పెడతానంటూ ఎవరో బెదిరింపు మెయిల్ పంపారు. దాన్ని చదివి కంగారుపడిన బాధితుడు, తన ఎవరితోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోలేద కదా, మరెవరలా చేసుంటారని బాగా ఆలోచించాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి తన సమస్య వివరించారు.
షాకింగ్..
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడికి వచ్చిన మెయిల్ ఐపి అడ్రస్ ఆధారంగా కూపీ లాగారు. చివరకు బాధితుడికి మెయిల్ అదే ఇంటి నుండి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంట్లోని సభ్యలను విచారించడం మొదలుపెట్టారు. అందులో 5వ తరగతి చదువుతున్న బాధితుడి కొడుకు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పిల్లవాడు చెప్పిన నిజాలు విని పోలీసులు కూడా షాకయ్యారు. మెయిల్ పంపింది తనేనని పిల్లవాడు ఒప్పుకోవడంతో కేసులోకి చిక్కుముడి వీడింది.
Must Read ;- వ్యాక్సిన్ పేరుతో కాల్స్.. నిమిషాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ..
ఇదంతా పిల్లవాడు ఎలా చేశాడు?
ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో సైబర్ క్రైమ్‌కు సంబంధించిన వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. పోలీసులకు దొరక్కుండా ఎలా చేయాలో అనే వీడియో కూడా పిల్లవాడు వీక్షించినట్లు విచారణలో తేలింది. ఇలా యుట్యూబ్‌లో నేర్చుకున్న విద్యను కన్నతండ్రిపైనే ప్రయోగించాడు. జనవరి 1వ తేదీ నాటి నుండి ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పిల్లవాడు ఒప్పుకున్నాడు.
ఏడ్వాలా.. నవ్వాలా..
11 ఏళ్ల వయసుకే ఇన్ని తెలివి తేటలు కలిగి ఉన్నాయని అనందించాలో లేక వాటిని దుర్వనియోగం చేసినందుకు బాధపడాలో ఆ ఇంటి సభ్యులకు అర్థం కావడం లేదు. ఇంత చిన్న వయసులోనే అంతటి తెలివి కలిగి ఉండడం సాధారణ విషయం కాదు. కానీ, వాటిని ఉపయోగించి ఏకంగా ఇంట్లో వాళ్లనే బెదిరించడం తలుచుకుంటేనే భయం కలిగిస్తుంది. ఈ వయసులోనే అతనికి సరైన కౌన్సలింగ్ ఇచ్చి సరైన దారిలో పెట్టకపోతే.. భవిష్యత్తులో మరిన్ని అకృత్యాలకు పాల్పడే అవకాశాలు మెండు.
పిల్లల్ని గమనించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ అనేది ప్రతి ఇంట్లో భాగమైపోయింది. ఇంటి నుండి పని చేయాల్సి రావడం, ఆన్ లైన్ క్లాసులు వంటి వాటి వల్ల ఇంటర్నెట్ తప్పని సరి అయిపోయింది. కానీ, పిల్లలు ఏం చేస్తున్నారనేది ఎప్పటి కప్పుడు గమనించుకోవాలి. అందుకోసం నెట్ ప్రొవైడర్లను సంప్రదించి పిల్లల ఏం చూస్తున్నారనేది తెలుసుకోవచ్చు. వారేమైనా అభ్యంతరకరమైనవి చూస్తుంటే, వారికి వాటి దుష్ప్రభావాల గురించి తెలియజేయండి. ఆన్ లైన్ మోసాల బారిన పడకూడదని తెలియజేస్తూనే.. మోసాలకు పాల్పడే వారి పరిస్థితి ఏమవుతుందనేది వారికి తెలిసేలా చెప్పండి. ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా తప్పు చేస్తే
దొరికిపోతారనేది వారికి స్పష్టం చేయండి. వారిలోని అపారమైన తెలివితేటలు మంచివైపు నడిచేలా దిశా నిర్ధేశాలు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని మరవకండి.
Also Read ;- హార్వర్డ్ వర్సిటీ పేరుతో జర్నలిస్టుపై సైబర్ అటాక్