వైసీపీ పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన టీడీపీ కూటమి సర్కారు…అప్పటిదాకా మంగళగిరి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతున్న ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీఐడీ అధికారులు కేవలం రోజుల వ్యవధిలోనే దా*డికి సంబంధించిన కారణాలతో పాటు సూత్రధారులు ఎవరన్న విషయంలోనూ కీలక ఆధారాలు సేకరించింది. టీడీపీ కార్యాలయంపై దా*డికి దిగిన బ్యాచ్ కు నేతృత్వం వహించిన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అద్యక్షుడు పానుగంటి చైతన్య ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఆధ్వర్యంలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన మరుక్షణమే అండర్ గ్రౌండ్ కు వెళ్లిన చైతన్య… కేసు సీఐడీకి బదిలీ అయిన మరుక్షణమే బుద్ధిగా బయటకు వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు చైతన్యను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఐడీ విచారణలో భాగంగా చైతన్య పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చైతన్య… దా*డికి ముందు వైసీపీ కార్యాలయంలో జరిగిన చర్చలను సమగ్రంగా బయటపెట్టాడు. నాడు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం… నాడు సీఎంగా ఉన్న జగన్ ను పరుష పదజాలంతో దూషిస్తూ సాగారు. ఈ ప్రెస్ మీట్ ను లైవ్ లో చూసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, నాడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నాడు బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేశ్, వైసీపీ కార్యాలయ ఇంచార్జీ లేళ్ల అప్పిరెడ్డి, జగన్ కార్యక్రమాల పర్వవేక్షకుడి హోదాలో ఉన్న తలశిల రఘురాం, బెజవాడకు చెందిన యువ నేత దేవినేని అవినాశ్ తదితరులు హాజరయ్యారు. వీరంతా మాట్లాడుకుని పానుగంటి చైతన్యకు ఫోన్ చేసి తక్షణమే కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ కీలక నేతలతో పాటు తనకు రాజకీయ పరంగా గురువుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి మాట మేరకు చైతన్య తన అనుచర గణాన్ని వెంటేసుకుని హుటాహుటీన వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై పట్టాభి మరీ దారుణంగా విమర్శలు చేస్తున్నారని, ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి ఉందని సజ్జల అండ్ కో చైతన్యకు చెప్పారు. అసలు అలాంటి ప్రెస్ మీట్ కు అనుమతించిన టీడీపీ కార్యాలయం ఇకపై కనిపించకూడదని కూడా ఈ సందర్భంగా చైతన్యకు ఆదేశాలు అందాయి. పనిలో పనిగా జగన్ పై ఇక మీదట విమర్శలు చేయాలంటేనే ఇతరులు భయపడేలా పట్టాభిని తుదముట్టించాలని కూడా చైతన్యకు ఆదేశాలు అందినట్లు సమాచారం. మొత్తంగా వైసీపీ కీలక నేతల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న చైతన్య… తన అనుచరులతో పాటు మరింత మందిని క్షణాల్లో పోగేసుకున్నాడు. వారి చేతుల్లో రాడ్లు, కర్రలు, రాళ్లు పెట్టి… వారితో కలిసి టీడీపీ కార్యాలయంపైకి దండెత్తాడు.
ఒకేసారి 200 మందికి పైగా వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయంపైకి దాడికి దిగడంతో కార్యాలయ సిబ్బంది భయంతో వణికిపోయారు. మారణాయుధాలతో అక్కడికి వచ్చిన చైతన్య అండ్ కో… ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా… వచ్చీరావడంతోనూ దాడికి తెగబడింది. టీడీపీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లిన ఈ మూకలు కార్యాలయంలోని విలువైన ఫర్నిచర్ ను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా అటుగా వచ్చిన కార్యాలయ సిబ్బందిపై ఈ మూక విక్షణారహితంగా దా*డి చేసింది. అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులను మారణాయుధాలతో తరిమింది. అయితే అప్పటికే అక్కడికి పోలీసులు రావడంతో కొందరు పోలీసులపైనా చైతన్య ముఠా దా*డికి దిగింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారగా… పైన ఉన్న పట్టాభి వద్దకు వెళితే… తిరిగి వెనక్కు రావడం కష్టమేనని భావించి.,. చైతన్య ముఠా వెనక్కు తగ్గింది. అక్కడికి పోలీసులు రావడం కాస్తంత ఆలస్యమై ఉంటే మాత్రం… నాడు పట్టాభి వైసీపీ మూకల దా*డిలో ఏమైపోయారోనన్న భయాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి.