తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4.15 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి నివాసంలో తన ప్రతినిధుల బృందంతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో పాటు, పున్నమి ఘాట్‌లో వైభవంగా జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో ప్రత్యేక అతిథిగా విజయ్ పాల్గొంటారు. సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ భేటీకి ప్రధాన అజెండా అంతర్రాష్ట్ర జల వివాదాలు, కీలక నీటిపారుదల ప్రాజెక్టుల చర్చలే కావడం గమనార్హం. ఉమ్మడి తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం ఏపీ ఏటా 12 టీఎంసీల కృష్ణా జలాలను తమిళనాడుకు అందించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి కేవలం 2.251 టీఎంసీల నీరు మాత్రమే అందింది. ఈ నేపథ్యంలో చెన్నై తాగునీటి అవసరాలు, మిగిలిన నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఈ సమావేశం వెనుక వాటర్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా గుర్తింపు పొందిన చంద్రబాబు విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ భారతదేశాన్ని శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా ఆయన ప్రతిపాదించిన 5 ప్రధాన నదుల అనుసంధానం (గోదావరి, కృష్ణా, పెన్నా, పాలార్, కావేరి)పై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. గతంలో కృష్ణ-గోదావరి నదులను అనుసంధానించి పట్టిసీమ ద్వారా చరిత్ర సృష్టించిన చంద్రబాబు, ఇప్పుడు అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో దక్షిణాది మొత్తానికి నీటి భద్రత కల్పించాలని సంకల్పించారు.
ఇటీవలే ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరిన చంద్రబాబు, ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌తో కూడా ఈ ప్రణాళికను పంచుకోనున్నారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న జలాలను మళ్లించడం ద్వారా ఏపీ, తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల దాహార్తిని తీర్చడంతో పాటు రైతులకు భరోసా ఇవ్వవచ్చని ఆయన ఆశిస్తున్నారు.











