ప్రతిపక్ష నిర్మాణాలు కూల్చేసెయ్.. ప్రజల ఆస్తులు ఆక్రమించేసెయ్.. అందినకాడికి భూములు కబ్జా చేసేసెయ్. ఇలా.. మూడు కూల్చివేతలు.. ఆరు కబ్జాలుగా సాగిపోతోంది మన షీఎం గారి సర్కారు. అసలు ఆయన పాలన మొదలైందే కూల్చివేతతో! చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ప్రజావేదిక’ను నిర్దాక్ష్యణ్యంగా కూల్చేశారు మన జననేత. ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన జనాలకు మన రాజన్న బిడ్డ ఇచ్చిన తొలి షాక్ ఇది.
ఆశలు కూల్చేసి.. ఆకాంక్షలు తుంచేసి!
ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగనోరి ప్రస్థానం.. చంద్రబాబు లక్ష్యంగా అప్రతిహతంగా సాగిపోతోంది. వ్యక్తిగతంగానైనా.. వ్యవస్థపైనైనా.. దాడి చేయడంలో మన జగనన్న శైలే వేరు! ఆయన దేన్నయినా లక్ష్యంగా చేసుకున్నారంటే.. ముందుగా దానికి బురద అంటిస్తారు. అది వ్యక్తయినా, వ్యవస్థయినా, నిర్మాణమైనా ఏదైనా సరే.. ఇదే విధానం అనుసరిస్తారు. నాడు ప్రజావేదికను కూల్చేముందు కూడా దానికి అక్రమ నిర్మాణమంటూ ముద్రవేశారు. సరే.. అది అక్రమ నిర్మాణమే అనుకుందాం. ప్రజాధనంతో నిర్మించింది కదా! కూల్చడమెందుకు? ఏ ప్రజా ఆస్పత్రిగానో మార్చి.. ప్రజల కోసం వినియోగించి ఉండొచ్చుగా! చంద్రబాబుపై కక్షను ఆయన నిర్మాణంపై చూపడమెందుకు?
ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన మన జగనోరి సర్కారు.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. ఒకటి తర్వాత ఒకటి నాశనం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో.. ఎన్ని నిరసనలు, విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. పైగా.. తన వందిమాగదులతో ఎదురు దాడి చేయించారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా వెనకడుగు వేయలేదు. పైగా.. న్యాయ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. జడ్జీలపై బురద జల్లారు. సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తినీ వదల్లేదు. మన తెలుగు వాడని కూడా చూడకుండా బురద జల్లేశారు. లక్ష్య సాధనలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ప్రతిపక్ష నేతల ఆస్తుల ధ్వంసం.. ఆర్థిక మూలాల నాశనం.. ఇదే ధ్యేయంగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన వేలాది పక్కా ఇళ్లను సమాధి చేసేశారు. జగనోరి కూల్చివేతల పర్వం ఇక్కడితో ఆగలేదు.
అమరావతిని సమాధి చేశారు
కంటికి కనిపించే వాటిని మాత్రమే కాదు.. కనిపించని వాటినీ వదల్లేదు మన జననేత. ప్రజల ఆశలపై నీళ్లు జల్లేశారు. ఆకాంక్షలను కూల్చేశారు. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరావతిని అటకెక్కించేశారు. అప్పటికే అక్కడ పూర్తయి ఉన్న నిర్మాణాలను శిథిలం చేసేశారు. ఇందుకోసం బురద జల్లే తన పాత పద్దతినే అనుసరించారు. అక్కడ ఏదో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిపోయిందట. భారీ అవినీతికి పాల్పడ్డారట. నిజంగా అవన్నీ జరిగుంటే.. విచారణ జరిపించి దోషులను శిక్షించండి. అంతేగానీ.. ప్రజల కలల రాజధానిని చంపేస్తే ఎలా? ‘ఇంట్లో ఎలుక దూరిందని.. ఇల్లే తగలెట్టేసుకుంటామా’! మూడు రాజధానులంటూ.. రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడేసుకుంటున్నారు. అదేమంటే.. అధికార వికేంద్రీకరణ అంటారు. అధికార వికేంద్రీకరణ చేయమని ఇప్పటికిప్పుడు జగనోరిని ఎవరడిగారు? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన వేళ.. మూడు రాజధానుల ముసుగులో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు.
అనాథలా మారిన పోలవరం
ఆంధ్రుల దశాబ్దాల కల పోలవరం.. పట్టించుకునే నాథుడు లేక అనాథలా మిగిలింది. గత ప్రభుత్వ హయాంలో ఆశలు రేగినప్పటికీ.. వాటిపై నిర్ధక్ష్యిణ్యంగా నీళ్లు చల్లేసింది మన జగనన్న ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. పోలవరానికి 55 వేల కోట్లు ఎందుకు? 20 వేల కోట్లు చాలన్నారు. 35 వేల కోట్లు.. చంద్రబాబు జేబులో వేసుకునేందుకే అంచనాలు పెంచేశారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు 20 వేల కోట్లు చాలని అంటూ.. కేంద్రం చేతికి తనే ఓ ఆయుధాన్ని ఇచ్చారు జగన్. ఇప్పుడు కేంద్రం అవే మాటలను పరిగణనలోకి తీసుకుని 20 వేల కోట్లతో సరిపెట్టుకొమ్మంటే.. కాదు.. కాదు.. 50 వేల కోట్లు కావాలంటున్నారు. అంటే.. ఒకప్పటి తన విమర్శలను తప్పుడువని ఒప్పుకున్నట్టేగా..! సరే.. ఆ 50 వేల కోట్ల కోసమైనా పోరాడుతున్నారా.. అంటే.. అదీ లేదు. కేసుల భయంతో పోలవరాన్ని చిన్న బ్యారేజీ స్థాయికి దిగజార్చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, ఆశలను ఆరడుగుల గోతిలో పాతిపెట్టేశారు. ప్రత్యక హోదాను సంజీవనితో పోల్చి.. నేడు దాన్ని కాలగర్భంలో కలిపేశారు. రాష్ట్ర ప్రయోజనాలను నిట్టనిలువునా కూల్చేశారు.
Also Read: నిద్ర లేచిన నాలుగో సింహం.. చంద్రబాబుపై ఆగ్రహం
జగనోరి నోట.. నిర్మాణాల మాట!
అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో తొలిసారిగా మన జగనోరు నిర్మాణాల గురించి మాట్లాడారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్ననంటూ ప్రగల్బాలు పలికారు. అందుకు 20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం.. 20 వేల కోట్లు ఎలా ఇవ్వబోతోంది? అంత పరిస్థితే ఉంటే.. ఆ సొమ్ము పోలవరం నిర్మాణానికి కేటాయించి.. దాన్ని పూర్తి చేస్తే.. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందిగా! ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందిగా! వారు స్వయం సమృద్ధి సాధించి.. తమ ఇళ్లు తామే కట్టుకుంటారుగా! మరి ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు? బహుశా.. ప్రజలు ఎప్పటికీ తమ మీదే ఆధారపడేలా చేసుకుని.. వారిని బిచ్చగాళ్లుగా మార్చడమే జగనోరి ఉద్దేశమేమో! ప్రభుత్వ పెద్దల మనసులో ఏముందో! లోగుట్టు జగనోరికే ఎరుక!
ఆత్మను చంపేసి.. అభిమానం పెంచుకునే దిశగా..
30 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో.. విలన్.. ఓ గ్రామాన్ని కబ్జా చేయాలనుకుంటాడు. అక్కడ ఓ ఫ్యాక్టరీ నిర్మించడం అతడి ఉద్దేశం. అందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. అందులో భాగంగా.. ఆ ఊరి ప్రజలకు కావలసిన నెలవారీ సరుకులు, బియ్యం ఉచితంగా వారి ఇంటికే సరఫరా చేస్తుంటాడు. దీంతో.. ఆ ఊరి జనం.. కూర్చుని తినడానికి అలవాటు పడిపోయి.. బద్దకస్థులుగా తయారవుతారు. వేరే సంపాదనా మార్గం లేక.. ప్రతిదానికీ విలన్ మీదే ఆధారపడడం మొదలెడతారు. దీన్ని అలుసుగా తీసుకున్న విలన్.. ఆ ఊరు మొత్తాన్నీ తన పేరిట రాయించేసుకుంటాడు. ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లో కూడా ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నట్టున్నారు మన షీఎం గారు. పుడితే పథకం.. చదువుకుంటే పథకం.. బడికెళ్తే పథకం.. వ్యవసాయం చేస్తే పథకం.. ఆటో నడిపితే పథకం.. ఏమీ చేయకున్నా పథకమే.. ఇలా.. పుట్టినప్పటి నుంచి పోయే దాకా ఏదో ఒక పథకం పేరుతో ఉచితంగా డబ్బులిస్తూ.. అందుకు జనాన్ని అలవాటుపడేలా చేసేస్తున్నారు. జనాన్ని బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. ఆత్మాభిమానికి అర్థాన్ని మరచేలా చేసేస్తున్నారు. వారి ఆత్మను చంపేసి.. తనపై అభిమానాన్ని పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఏమో.. దీని వెనకు ఏ వ్యూహముందో? జగనోరికే తెలియాలి.