ఆకాశ్ పూరి చిన్నప్పటి నుంచి సినిమా షూటింగులు చూస్తూనే పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. టీనేజ్ లోకి అడుగుపెడుతూనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత నుంచి యాక్షన్ తో కూడిన ప్రేమకథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. యూత్ ఆశించే రొమాన్స్ తన సినిమాల్లో తగ్గకుండా చూసుకుంటున్నాడు. ఏకంగా ‘రొమాంటిక్’ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
‘రొమాంటిక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగానే ఆయన ‘చోర్ బజార్’ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో ఆకాశ్ పూర్తిగా రఫ్ లుక్ తో కనిపించనున్నాడు. టైటిల్ కి తగినట్టుగానే ఆయన పాత్రను ఊరమాస్ గా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కి కావలసిన యాక్షన్ పుష్కలంగా ఉంటుందని అర్థమవుతోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వదిలిన ఈ సినిమా పోస్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఐ.వి.రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘దళం’ .. ‘జార్జిరెడ్డి‘ సినిమాలతో దర్శకుడిగా జీవన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు .. సహజత్వంతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో, ‘గెహన్ సిప్పి’ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాతో ఆకాశ్ మాస్ ఆడియన్స్ కి మరింత చేరువవుతాడేమో చూడాలి.











