జైలు నుంచి ACB కోర్టుకు తీసుకువస్తున్న ప్రతీసారి డ్రామాలు చేస్తుంటారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జైలు నుంచి మొదలు కోర్టుకు వచ్చేంత వరకు ఎవరిని వదిలిపెట్టనంటూ సినిమా తరహాలో డైలాగులు చెబుతుంటారు. పోలీసు అధికారులను బెదిరిస్తుంటారు. ప్రతీసారి ఈ సీన్ రిపీట్ అవుతోంది. ఆయన వ్యవహారం పోలీసులకు ఇబ్బందిగా మారింది. చెవిరెడ్డి తీరుతో పోలీసులు విమర్శల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు మేజిస్ట్రేట్.
మేజిస్ట్రేట్ ఏమన్నారంటే –
కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా.. మిగిలిన నిందితులు ఎలా ఉంటున్నారు. మీరెలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండంటూ చెవిరెడ్డిపై సీరియస్ అయ్యారు. రిమాండ్ పొడిగింపుపై వాదనల సందర్భంగా మేజిస్ట్రేట్ ఈ కామెంట్స్ చేశారు. పోలీసులే తనపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, బెయిల్‌ను అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారనీ చెవిరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు చెవిరెడ్డికి వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఇక కోర్టులోనూ చెవిరెడ్డి డ్రామాలు ఆపలేదు. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని, తిరుపతి స్విమ్స్‌లో ఫిజియో థెరపీ చేయించుకునేవాడినని చెప్పుకొచ్చారు.. 70 రోజుల నుంచి జైలులో ఉన్నానన్న చెవిరెడ్డి.. ఇప్పటి వరకు 120 మాత్రలు వేసుకున్నానని కోర్టుకు చెప్పారు. నొప్పిని నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకు వెళ్తుందన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఫిజియో థెరపీని తిరస్కరించానని చెప్పడం సరికాదన్నారు చెవిరెడ్డి. సమస్యను దృష్టిలో పెట్టుకుని చికిత్సకు అనుమతించాలని కోర్టును కోరారు. వెన్నునొప్పికి ఉండవల్లిలో ప్రకృతి చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న చెవిరెడ్డి పిటిషన్‌పై మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి. వెన్నునొప్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఫిజియో థెరపీ తీసుకునేందుకు తిరస్కరించారని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్రప్రసాద్ వాదించారు. నిందితుడి సమస్యపై వైద్య నిపుణులు పరీక్షించి నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. చెవిరెడ్డి తరఫున న్యాయవాది వాణి తన వాదనలు వినిపిస్తూ.. వెన్ను నొప్పి సమస్య ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందనీ, చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.











