అవినీతిపరుల కోసం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కొత్త పథకం తీసుకువచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో దోచుకునేందుకు క్విడ్ ప్రోకో వన్‌కు తెరలేపారని, నేడు జగన్ క్విడ్ ప్రోకో 2కు తెరలేపాడని ఆయన విమర్శించారు. సర్కారు వారి దొంగల పేరిట జగన్ కొత్త పథకం తీసుకువచ్చి దోపిడీకి తెరలేపాడని ఆయన ఆక్షేపించారు. క్విడ్ ప్రోకోలో వన్ లో సహకరించిన జైలుకెళ్లిన అధికారుల మాదిరి, క్విడ్ ప్రోకో టూ కు సహకరిస్తున్నఅధికారులు కూడా జైలుకెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. జగన్ అవినీతికి సహకరించిన అధికారులను అందలం ఎక్కిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
లీజుల గడవు అడ్డుగోలుగా పెంచుతారా
జగన్ సీఎం కాగానే సరస్వతి సిమెంటు లీజులు పునరుద్దరించుకున్నారని, తాజాగా ఇండియా సిమెంట్స్ కంపెనీ లీజులను ఏకంగా 50 సంవత్సరాలకు పెంచుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీలో రెండేళ్ల జగన్ పాలనలో ఏ వర్గానికి మేలు జరక్కపోగా, సీఎంతోపాటు కేసుల్లో ఉన్న సహనిందితుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు పార్లమెంటు స్థానాలకు కమిటీలు
నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాలకు పార్టీ కమిటీలను ప్రకటించారు. మాజీ మంత్రి జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమండ్రికి, జీవీ ఆంజనేయులు అధ్యక్షతన నరసరావుపేటకు 36 మందితో కమిటీలు వేశారు. మొత్తం 72 మందిలో 32 మంది బీసీలు, 18 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.
Must Read ;- టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్