తెలుగులో తమని తాము కొత్తగా మలచుకునే యంగ్ హీరోల్లో ఒకరిగా నాగశౌర్య కనిపిస్తాడు. గ్రీకు శిల్పాన్ని గుర్తుచేసే ఆకర్షణీయమైన రూపంతో నాగశౌర్య ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నాగార్జున తరువాత రొమాంటిక్ హీరోగా నిలదొక్కుకునే అవకాశాలు ఈ కుర్రాడికి ఎక్కువగా ఉన్నాయని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫామిలీ ఎంటర్టైనర్ జోనర్లలోనూ నాగశౌర్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా ప్రేమ .. కుటుంబ బంధాలు కాన్సెప్టుతో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఈ కారణంగానే మరోసారి ఆయన అదే జోనర్లో ఒక సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా పేరే ‘వరుడు కావలెను’
ఈ రోజున నాగశౌర్య పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘వరుడు కావలెను’ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆయన చేతిలో కాఫీ కప్పుతో .. స్వీట్ స్మైల్ తో .. చాలా సింపుల్ గా .. డిసెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్లో ఆయన చాలా స్టైలీష్ గా అనిపిస్తున్నాడు. తన ఇంట్లో తన షెల్ఫ్స్ లోని ఖరీదైన వాచ్ లు .. సూట్లు .. స్పెట్స్ లో నుంచి తనకి కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని ధరించే విజువల్స్ ను ఒక మ్యూజిక్ బిట్ పై కట్ చేసి వదిలారు. మొత్తానికి ఈ సినిమాలో ఆయన చాలా శ్రీమంతుడు అనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా చెప్పారు.
ఖరీదైన వరుడిగా నాగశౌర్య కనిపిస్తున్న ఈ సినిమాను, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. డీసెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్న నాగశౌర్య, ఈ ఏడాది ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి. ఇక ఇదే ఏడాదిలో ఆయన ‘లక్ష్య’ .. ‘పోలీస్ వారి హెచ్చరిక’ కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి.











