చూస్తుంటే నాగశౌర్య లాక్ డౌన్ సమయంలో లాక్ చేసుకుని కూర్చున్నట్టుగా ఎక్కడా అనిపించడం లేదు. ఇటు సొంత బ్యానర్లోను .. అటు బయటి బ్యానర్లలోను వరుస ప్రాజెక్టులను బాగానే సెట్ చేశాడు. ఒక ఆట వదలగానే మరో సినిమా కోసం ఆ పక్కనే ఉన్న మరో థియేటర్లోకి దూరినంత తేలికగా వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాదిలోనే కాదు .. వచ్చే ఏడాదిని కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన గట్టి కసరత్తు చేశాడనే విషయం అర్థమవుతోంది. చాక్లెట్ లాంటి కుర్రాడిలా కనిపిస్తాడుగానీ, చాకులాంటి కుర్రాడేనన్న మాట.
ఈ రోజున నాగశౌర్య పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ గా కొత్త పోస్టర్లు .. టీజర్లు .. స్పెషల్ వీడియోలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ వారు కూడా నాగశౌర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ బ్యానర్లోని 12వ సినిమాను ఆయనతో చేయనున్న విషయాన్ని ప్రకటించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి, శ్రీమాన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ గతంలో మంచి హిట్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం వాళ్లు ప్రకటించినది ఆ బ్యానర్లో 12వ సినిమా కాగా, నాగశౌర్యకి ఇది 24వ సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎటు చూసినా ఇప్పుడు నాగశౌర్య చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో ఓ మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదలైతే, మరో మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ లోగా నాగశౌర్య మరెన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంటాడో చూడాలి మరి.
Must Read ;- వరుడుగా నాగశౌర్య బర్త్ డే సర్ ప్రైజ్.. !











