తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు పెట్టించిన కమెడియన్స్ లో సునీల్ స్థానం ప్రత్యేకం. ఒక వైపున బ్రహ్మానందం .. మరో వైపున ఎమ్మెస్ నారాయణ .. ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ కమెడియన్స్ తమ జోరు చూపిస్తుండగా సునీల్ ఎంట్రీ ఇచ్చాడు. హాస్యాన్ని పండించడంలో పండిపోయిన వాళ్లందరికి భిన్నంగా కామెడీని అందిస్తే తప్ప సునీల్ నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ఆ విషయాన్ని గ్రహించిన సునీల్, మొదటి నుంచి కూడా కామెడీలో తనదైన శైలిని ఆవిష్కరిస్తూ వెళ్లాడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో .. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తారాజువ్వలా దూసుకెళ్లాడు. ఒకానొక సమయంలో సునీల్ లేని సినిమా అంటూ ఉండేది కాదు. తన టాలెంట్ తో సునీల్ అంతగా అవకాశాలను ఆక్రమించేశాడు.
అటు సీనియర్ హీరోల సినిమాల్లోను .. ఇటు యువ కథానాయకుల సినిమాల్లోను ఆయన ఓ కమెడియన్ గా చెలరేగిపోయాడు. వరుస సినిమాలు .. వరుస విజయాలు సునీల్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆయన క్రేజ్ .. దానితో పాటే రెమ్యునరేషన్ పెరుగుతూ పోయాయి. ఈ నేపథ్యంలోనే సునీల్ కి కథానాయకుడిగా చేసే అవకాశం వచ్చింది. కమెడియన్ గా సక్సెస్ ను అందుకున్నవారిలో చాలామంది హీరోలుగా చేసిన సందర్భాలు వున్నాయి. అందువల్లనే సునీల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రంగంలోకి దిగాడు. హీరోగా తొలినాళ్లలో ఆయనకి వరుస విజయాలు దక్కాయి. ఆ తరువాతనే పరాజయాలు పలకరించడం మొదలైంది.
హీరోగా ఒక ప్రయోగం మాత్రమే చేసి, వెంటనే సునీల్ వెనక్కి వచ్చేస్తే బాగుండేది. కానీ ఆయన చాలా సీరియస్ గా .. సిన్సియర్ గా హీరోయిజం కలిగిన కథలను చేస్తూ వచ్చాడు. యాక్షన్ సీన్స్ కోసం సిక్స్ ప్యాక్ లు సైతం చేశాడు. అంతగా కష్టపడిన కారణంగానే తిరిగి కమెడియన్ గా వెనక్కి రావడానికి ఆలస్యం చేశాడు. ఒక వైపున హీరోగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున కమెడియన్ గాను చేస్తానని చెప్పి రంగంలోకి దిగాడు. అలా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కి, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత‘లో చేసే అవకాశం లభించింది.
సునీల్ కమెడియన్ గా ఎదగడం వెనుక త్రివిక్రమ్ హస్తం వుందనేది కాదనలేని నిజం. త్రివిక్రమ్ తన కథల్లో సునీల్ కోసం వైవిధ్యభరితమైన పాత్రలను సృష్టించేవాడు. అందువలన ‘అరవింద సమేత’లో సునీల్ కి మంచి పాత్ర పడుతుందనీ, కమెడియన్ గా మళ్లీ ఆయన చెలరేగిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ అలా జరగలేదు .. సునీల్ పాత్రను ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోనూ సునీల్ అద్భుతమైన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
‘అల వైకుంఠపురంలో’ సునీల్ పాత్రను డిజైన్ చేసే విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెప్పుకున్నారు. కమెడియన్ గా ఈ సినిమా సునీల్ కి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని అన్నారు. కానీ అసలు ఆ సినిమాలో సునీల్ ఎక్కడున్నాడో వెతుక్కోవలసి వచ్చింది. ఇక మరో వైపున సునీల్ చేసిన ఇతర సినిమాల్లోను ఆయన పాత్రలకి లభించే గుర్తింపు అంతంత మాత్రంగానే వుంది. ఈ నేపథ్యంలో ఆయన అయోమయంలో పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ మునుపటి సునీల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పాత్ర ఎప్పుడు పడుతుందో .. అలాంటి పాత్రను ఆయనకి ఎవరిస్తారో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ?