తమిళ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పోట్రు’. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్ తో రిలీజ్ చేశారు. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు డా. జి.ఆర్ గోపీనాథ్ జీవితకథ స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా ఈ విభిన్న కథా చిత్రాన్నిథియేటర్లలో కాకుండా.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు.
అప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలన్నీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే.. ఈ మూవీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. ఓటీటీలో విడుదలైనప్పటికీ విశేష స్పందనతో సక్సస్ సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. జనరల్ కేటగిరీ కింద పలు అవార్డులకు ఎంపికైంది. ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు విభాగంలో పోటీపడుతోంది.
‘సూరారై పోట్రు’ ప్రస్తుతం అకాడమీ స్క్రీనింగ్ దశలో అందుబాటులో ఉంది. ఈ వార్తలను అభిమానులకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ చిత్ర సహ నిర్మాత రాజ్‌శేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలాగే.. సూరరైపొట్రూ ఆస్కార్ బరిలోకి ఎంటరైందని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా వుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ పోటీపడుతోంది అని సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ వెల్లడించారు. మరి.. ఆస్కార్ అవార్డ్ లను దక్కించుకుంటుందేమో చూడాలి.











