తెలుగు తెరపై తెలుగు కథానాయిక కనిపించక అసంతృప్తితో వున్న ప్రేక్షకుల ముచ్చట తీరుస్తూ, చాలాకాలం క్రితమే అంజలి ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ .. ‘రాజోలు’లో పుట్టిపెరిగిన అంజలి, కోలీవుడ్ కోటలో పాగా వేయడమే కాకుండా, తెలుగువారి గుమ్మంలోను అడుగుపెట్టింది. అంజలి అచ్చతెలుగు రూపం .. ఆమె వాయిస్ .. అలవోకగా డైలాగ్స్ చెప్పే తీరు .. నటనలోని ప్రత్యేకత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో, నటనపరంగా అంజలి మంచి మార్కులు కొట్టేసింది. అల్లరి పాత్రలు మాత్రమే కాదు, ఆవేదన నిండిన పాత్రలు కూడా ఈ అమ్మాయి బాగా చేయగలదు అనిపించుకుంది.
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా విజయంతో అంజలి మరిన్ని అవకాశాలను అందుకుంది. ‘గీతాంజలి’ సినిమాతో అంజలి తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఈ హారర్ కామెడీ సినిమాలో అక్కాచెల్లెళ్లుగా ఆమె రెండు వైవిధ్యభరితమైన పాత్రల్లో మెప్పించింది. అంజలి కథాభారాన్ని పూర్తిగా భుజాన వేసుకుని నాయిక ప్రధానమైన సినిమాలను నడిపించగలదు అనే నమ్మకాన్ని ‘గీతాంజలి’ కలిగించింది. ఈ సినిమా సక్సెస్ .. అంజలి నాయిక ప్రధానమైన మరికొన్ని హారర్ మూవీస్ చేయడానికి దోహదపడింది. ఇక ‘డిక్టేటర్’ లో అంజలి ఒక రేంజ్ లో అందాల సందడి చేసింది. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ నుంచి ఆమెకి మరింత సపోర్ట్ లభించింది.
Also Read ;- తెలుగులోకి మరో అందాల మలయాళీ భామ
ఇక ఇటీవల థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నిశ్శబ్దం’లోను అంజలి నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అంజలి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలు వున్నాయి. వాటిలో ‘వకీల్ సాబ్’ ముందుగా ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఆ తరువాత సినిమాగా అంజలి చేస్తున్న ‘ఆనందభైరవి’ కూడా చిత్రీకరణపరంగా ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. అంజలి ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, రాయ్ లక్ష్మీ .. అదిత్ అరుణ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు, మలయాళం నుంచి రీమేక్ కానున్న మరో తెలుగు సినిమాలోను అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి చేస్తున్న రెండు తమిళ సినిమాలు .. ఓ కన్నడ సినిమా కూడా సెట్స్ పైనే వున్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా రానున్న ఈ సినిమాల్లో అంజలి ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలను పోషిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు థియేటర్స్ కి రానున్నాయి. విభిన్నమైన జోనర్లలో రూపొందిన ఈ సినిమాలపై అంజలి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను తన కెరియర్ మరింత పుంజుకుంటుందని అంజలి ఆశిస్తోంది. ఆమె నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి మరి.
Must Read ;- కిక్ దిగకముందే.. లైన్లో మూడు సినిమాలు