వైసీపీ పాత మిత్రుడు, ప్రస్తుత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. వైసీపీలో ఓ వెలుగువెలిగిన గొట్టిపాటి రవి టీడీపీ నేతల ఒత్తిడితో 2018లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గొట్టిపాటి రవికి గ్రానైట్ వ్యాపారాలు ఉండటం ఒక విధంగా మేలు చేసినా, అతను ఏ పార్టీలో నిలకడగా లేకుండా పోవడానికి కూడా ఆ వ్యాపారాలే కారణం అవుతున్నాయి. తాజాగా గొట్టిపాటి రవికి చెందిన 13 గ్రానైట్ గనులను వైసీపీ ప్రభుత్వం సీజ్ చేసింది.
పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేశారు. దీంతో చేసేదిలేక గొట్టిపాటి రవికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఇక వ్యాపారాలు చేసుకోవచ్చని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్రానైట్ రాయిని తరలించి ఎగుమతి చేసే సమయంలో రవాణా శాఖ అధికారులు అనేక అడ్డంకులు పెడుతున్నారట. దీంతో గొట్టిపాటి రవికుమార్‌కు విషయం అర్థంమైంది. వైసీపీలో చేరితో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారట.
వైపీసీలో చేరడం లాంఛనమే..
ఇప్పటికే అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా మంత్రి బాలినేనితో పలు దఫాలు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వైసీపీలో పనిచేసినప్పటి నుంచీ మంచి ఫ్రెండ్ షిప్ ఉందట. గతంలో బాలినేనికి అనేక విధాలుగా గొట్టిపాటి రవికుమార్ ఆదుకున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో మంత్రి బాలినేని ద్వారా గొట్టిపాటి మరలా వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గొట్టిపాటిని తీసుకునేందుకు సిద్దంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే గొట్టిపాటిని సరైన సమయంలో వైసీపీలోకి తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం.
వ్యాపారస్తులు ఇక రాజకీయాల్లో కష్టమే…
దేశంలో ఎక్కడా లేని రాజకీయదాడులు ఏపీలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రతిపక్ష నేతల వ్యాపారాలను గుర్తించి, ఆ వ్యాపారాన్ని దెబ్బతీసే వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయాలనుకునే వారికి చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ నేతల ఒత్తిడి తట్టుకోలేక, వ్యాపారాలు మూసివేసుకోలేక ఇప్పటికే టీడీపీ ప్రముఖ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే దారిలో మరికొందరు కూడా ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది.
తెలుగుదేశం ప్రతిపక్ష హోదా కోల్పోతుందా?
ఇప్పటికే టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. దీంతో టీడీపీ సభ్యుల సంఖ్య 23 నుంచి 19కు తగ్గింది. గొట్టిపాటి రవికుమార్ కూడా వైసీపీలో చేరిపోతే ఇక అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య 18కి తగ్గుతుంది. ఆ తరవాత మరో సభ్యుడు టీడీపీ వీడితే ఇక చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా కేబినెట్ స్థాయి హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది. ఆరుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీని వీడినా సరే.. అధికారికంగా రికార్డుల ప్రకారం తెలుగుదేశం తరఫునే కొనసాగుతున్నారు. వారు టెక్నికల్ గా అలా ఉన్నంత కాలం చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేత హోదాకు దిగుల్లేదనే వాదన కూడా ఉంది.