ఆఫ్ఘనిస్తాన్ ఇక సురక్షితం కాదు. అందరూ భయపడినట్టుగానే ఆ దేశ రాజధాని కాబూల్ పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడ్డారు. ఆఫ్ఘన్ లోని విదేశీయులతో పాటు ప్రాణభయంతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా భావించిన ఐసిస్ ఉగ్రవాదులు.. తాము తాలిబాన్ల కంటే ప్రమాదకరమైన వారమేనని చెప్పే క్రమంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. వరుసగా ఆరు చోట్ల జరిగిన ఈ బాంబు దాడుల్లో వంద మంది దాకా మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మృతుల్లో అమెరికా బలగాలకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నట్లుగా సమాచారం.
వరుస పేలుళ్లు
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు చేసిన హెచ్చరికలను నిజం చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కాబూల్ విమానాశ్రయం గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. తమ దేశ పౌరులతో పాటు ఆఫ్ఘన్లు కూడా కాబూల్ విమానాశ్రయ పరిసరాలకు రావొద్దని అమెరికా గురువారం ఉదయమే హెచ్చరించగా, ఈ హెచ్చరిక వెలువడ్డ కొన్ని గంటల్లోనే పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తొలుత 73 మంది మరణించారని వార్తలు రాగా.. కాసేపటికే ఆ సంఖ్య 90కి చేరిందని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసిన ఐసిస్ తన ఆత్మాహుతి దళ సభ్యులను రంగంలోకి దించి మారణ హోమాన్ని సృష్టించింది. తొలి పేలుడు ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు వద్ద జరగ్గా, రెండో పేలుడు బేరన్ హోటల్ వద్ద చోటుచేసుకుంది. ఆ తర్వాత అక్కడికి సమీప ప్రాంతాల్లోనే మరో నాలుగు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడులతో ఎయిర్ పోర్టులో ఉన్న వారంతా ప్రాణాలు అరచేత బట్టుకుని పరుగులు తీశారు.
అమెరికా స్పందనిదే
నిజానికి ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు ముందే అప్రమత్తం అయ్యాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించిన ఆయన.. ఇంతకింత ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టుబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని తమ బలగాలను ఆదేశించారు. తమ మిషన్ కొనసాగుతుందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను తరలిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన ఉగ్రదాడిలో తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని బైడెన్ పేర్కొన్నారు. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నామని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. ఈ నెల 31న గడువు తేదీ నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని బైడెన్ పునరుద్ఘాటించారు.
ఒప్పేసుకున్న ఐసిస్
కాబూల్‌లో రక్తపాతం సృష్టించిన వరుస పేలుళ్లు తమ పనేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా మొత్తం 90 మంది వరకు చనిపోయారు. మరో 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ పేలుళ్లను భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం సంఘటితం కావాల్సిన అవసరాన్ని ఈ పేలుళ్ల ఘటన చాటుతోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న విషయం ఈ ఘటన ద్వారా బోధపడుతోందని పరోక్షంగా పాకిస్థాన్ కు చురకలంటించింది. అదే సమయంలో అమెరికా మాదిరే ఐక్యరాజ్య సమితి కూడా ఈ దాడులపై తీవ్రంగా స్పందించింది.
Must Read ;- శరణార్థులుగా తాలిబాన్లు.. ఎన్నెన్ని దేశాలకు చేరారో?