ఎద్దుల బండ్లలో రీచ్ వద్దకు వచ్చిన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చేలా జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతరత్రా వాహనాలు తెచ్చుకుంటే వారికి టన్నుల వంతున ఇసుకను అందజేస్తారు. రవాణా ఖర్చులు ఎవరికి వారే భరించుకోవాలి. ప్రస్తుతం ఒక టన్ను ఇసుకకు రూ.375 వసూలు చేస్తున్నారు. ఆ ధరను కాస్త పెంచే అవకాశం కూడా ఉంది. స్థూలంగా చూసినప్పుడు ఇది చంద్రబాబునాయుడు అనుసరించిన విధానానికి దగ్గరగా అనిపిస్తుంది.
చంద్రబాబునాయుడు హయాంలో చివరిదశకు వచ్చేసరికి ఉచితంగా ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఆ పద్ధతిలో ప్రజలకు ఇసుక పూర్తిగా ఉచితం. తవ్వుకోడానికి, రవాణాకు ఖర్చులు వారే పెట్టుకోవాలి. అదీ పద్ధతి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తొలుత ఇసుకతవ్వకాల్ని కొన్ని నెలల పాటు ఆపేశారు. నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆత్మహత్యలు జరిగాయి. పరిశ్రమ స్తంభించిపోయింది. ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డపేరు వచ్చింది. తర్వాత కొత్త ఇసుక పాలసీ ప్రకటించారు. అది చాలా గందరగోళంగా తయారైంది. ప్రభుత్వానికి మరింత అపకీర్తి దక్కిందే తప్ప మంచి పేరు రాలేదు. ఇసుక ముసుగులో భారీగా దోపిడీలు మొదలయ్యాయి. తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చింది.
దీని ప్రకారం టన్నుకు రూ.375 వసూలు చేస్తారు. అది తవ్వకానికి లోడింగ్ కు అయ్యే ఖర్చుకు రుసుము కింద భావించాలి. రవాణాతో ప్రభుత్వానికి సంబంధం లేదు. రవాణా రూపేణా దోపిడీకి తమ పరంగా అవకాశం లేకుండా వదిలించుకున్నారు. కావల్సిన వారు ట్రాక్టరు లేదా లారీ.. తమకు వీలైన వాహనాన్ని రీచ్ వద్దకు తీసుకువెళితే.. ఇసుక నింపుతారు. రీచ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు ఎద్దులబండిని తీసుకువెళితే.. ఉచితంగా ఇసుక నింపుతారు. సాధారణంగా ఇది సాధ్యమయ్యే పని కాదు. అది పనిగా ఇసుక దందాలు నడిపించుకోడానికి ఎవరైనా ఎద్దుల బండ్ల వాడాల్సిందే తప్ప.. ఇప్పట్లో బండ్లు లేవు. ఆ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు. మేం ఉచితంగా కూడా ఇస్తున్నాం అని చెప్పుకోడానికి తప్ప ఇది ఎందుకూ పనికిరాదు. కావాలంటే.. ఓ నెల తర్వాత ఎన్ని ఎద్దుల బండ్లలో ఎన్ని టన్నుల ఇసుక నింపారో.. మొత్తం విక్రయాల్లో అది ఎంత శాతమో పరిశీలిస్తే ఇంకా స్పష్టత వస్తుంది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ముసుగులో అరాచకాలకు అవకాశం లేదా అనేది ప్రశ్న. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకతవ్వకాలను మొత్తం ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని మూడు సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకల్ గా రీచ్‌లు వేలం వేయకుండా.. ఇలా మూడు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన వలన- అటు ప్రజలకు గానీ, ఇటు ప్రభుత్వానికి గానీ అదనంగా ఒనగూరే లాభం ఏమిటో పాలకులు ఒకసారి ప్రజలకు విశదపరచాలి. ప్రభుత్వానికి సన్నిహితులైన, ప్రభుత్వంలో భాగంగా ఉండే.. ముందుముందు పార్టీ అవసరాలకు దన్నుగా ఉండగల కొందరు పెద్దల సంస్థలకు గుత్తగా కట్టబెట్టడానికే ఇలాంటి నిర్ణయం చేసినట్లుగా కూడా పుకార్లున్నాయి.
ఇలా గుత్తకు తీసుకున్న సంస్థలు ఇసుకను అక్రమంగా తవ్వుకోకుండా ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తారో తెలియదు. ఇదివరకు సీసీ కెమెరాలు పెడతాం అంటూ చాలా హడావుడి చేశారు. పాలసీ పూర్తి అంశాలు ఇంకా వెలికి రాలేదు గనుక.. స్పష్టత లేదుగానీ.. ప్రజలకు అనుమానాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.
స్థూలంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అటూ ఇటూ తిరిగి చంద్రబాబునాయుడు గతంలో అనుసరించిన మార్గం వైపే వస్తున్నట్లుంది. చంద్రబాబు జమానాలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తూ, తవ్వకం లోడింగ్ ఖర్చులు మాత్రం తీసుకునే వారు. రవాణా ఎవరి బాధ్యత వారిదే. ఇప్పుడు కూడా రవాణా విషయంలో అదే బాట తొక్కి, టన్నుకు ఇంత అని లోడింగ్, తవ్వకం ఖర్చులకోసం నిర్ణయించారు. చంద్రబాబు పాలన నాటికంటె తక్కువ ధరకు ఇసుక వచ్చే ఎంత మాత్రమూ లేదు.
తప్పు తెలుసుకున్నట్టేనా?
సుదీర్ఘకాలం నిషేధం తర్వాత.. జగన్ సర్కారు గతంలో కొత్త ఇసుక పాలసీ తెచ్చింది. ఏడాది కూడా గడవలేదు. ఆ పాలసీని మార్చేస్తూ ఇప్పుడు మరో కొత్త పాలసీ తెచ్చింది. అంటే ఇన్నాళ్లూ అమలు చేసిన పాలసీ లోపభూయిష్టమైనదే అని ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అప్పట్లో ఆ పాలసీ ఒక అద్భుతం అని.. ప్రజలకు మహోపయోగం అని డప్పు కొట్టిన వాళ్లంతా ఒకసారి తమ మాటలను వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఇన్నాళ్లూ ఆ పాలసీ ద్వారా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశామనే సంగతిని వారు గుర్తుంచుకుంటే చాలు.
చంద్రబాబునాయుడు పాలనలో ఇసుకాసురులు తయారయ్యారని వైసీపీ అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఇసుక మాఫియా చాలా బలంగా పనిచేస్తోందని తిట్టిపోసింది. ఆ అక్రమాలను అరికట్టడానికే తాము కొత్త పాలసీ తెస్తున్నట్టు ప్రకటించింది. చంద్రబాబునాయుడు ఇసుకను దోచుకున్నారా.. ఆయన దోపిడీకి జగన్ అడ్డుకట్ట వేశాడా.. ఈ కబుర్లన్నీ ప్రజలకు అనవసరం. అప్పటికంటె ఇప్పుడు ఇసుక తమకు తక్కువ ధరకు వస్తోందా లేదా అనే విషయాన్ని మాత్రమే వారు గమనిస్తారు. ధర పెరిగితే.. కొత్త ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. వారికి తెలిసివచ్చే తేడా అదొక్కటే. మరి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.
.. సురేష్ పిళ్లె











