కరోనా సెకండ్ వేవ్ ముగిసింది.. ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సినిమాల విడుదలంటే పిల్లి మెడలో గంట కట్టేవారు కావాలి. దాని కోసం పెద్ద నిర్మాతలు చూశారు.. చిన్న నిర్మాతలు సాహసించారు. జులై 30 నుంచి సినిమా విడుదల ప్రారంభమైనా జనం నుంచి స్పందన అంతంత మాత్రమే. తిమ్మరుసు, ఇష్క్ చిత్రాలు విడుదలయ్యాయి. తిమ్మరుసుకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా వర్కవుట్ కాలేదు. ఇష్క్ అయితే సోయిలో లేకుండా పోయింది. ఇక ఆగస్టు మొదటి వారం మెరుపులు మెరిపించడానికి వచ్చింది.
ఎస్ఆర్ కళ్యాణమండపం, మెరిసే మెరిసే చిత్రాలు జనం ముందుకు వచ్చయి. జులై 30 నుంచి విడుదలైన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవి ఎప్పుడు విడుదలయ్యాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక ఆగస్టు మూడోవారం కూడా వచ్చేసింది. విశ్వక్సేన్ పాగల్, బ్రాందీ డైరీస్, ఒరేయ్ బామ్మర్ది లాంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇక హాలీవుడ్ చిత్రం ది కాంజురింగ్ కూడా జనంలోకి వచ్చేసింది. వీటి కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పలేం.
కరోనా మొదటి వేవ్ తర్వాత శుభారంభం కలిగినా రెండో వేవ్ తర్వాత మాత్రం ఆ స్పందన లేదు. వీటిలో ఒక్క ఎస్ఆర్ కళ్యాణమండపం మాత్రమే ఆశాజనకమైన ఫలితాన్ని ఇచ్చింది. సినిమాకి అంత పాజిటివ్ టాక్ రాకపోయినా ఆ సినిమా మీద ఉన్న హైప్ మంచి కలెక్షన్లు రాబట్టడానికి తోడ్పడింది. ఈ కలెక్షన్లు చూశాక పెద్ద నిర్మాతల్లోనూ నమ్మకం కలిగింది. ‘పాగల్’ ఫలితం చూశాక మిగిలిన వారంతా ముందుకు రావచ్చు.
కళ్యాణమండపం లాభాల్లోనే..
సినిమాలో కళ్యాణమండపం నిర్వహణ కష్టంగా కనిపించినా థియేటర్లలో మాత్రం కళ తెప్పించింది. బయ్యర్లు డబ్బులు పెట్టి కొన్న తొలి సినిమాగా కూడా దీన్ని చెప్పవచ్చు. కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు సాధించింది. నైజాం లాంటి ఏరియాలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. వైజాగ్ లో మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఓవర్సీస్ లోనూ కలెక్షన్లు అలాగే ఉన్నాయి. నైజాం, వైజాగ్, కర్ణాటకలో రెండు కోట్ల పది లక్షలకు ఈ సినిమాని కొనడం విశేషం. ఫలితం చూశాక బయ్యర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కొంత నిరాశ కలిగించినా మిగిలిన ఏరియాల్లో మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇందులోని పాటలు ఈ సినిమాకి కొంత ప్లస్ అయ్యాయి. హీరో చలాకీ తనం కూడా అతనికి ప్లస్ అయ్యింది. తిమ్మరుసు సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చినా కలెక్షన్ల పరంగా వెనకబడిపోయింది. కళ్యాణమండపానికి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు బాగుండటం విశేషం. కళ్యాణమండపం కలెక్షన్లు చూడండి మీకే తెలుస్తుంది.











