ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన పుష్ప టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ‘పుష్ప’ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో సాగే రివెంజ్ యాక్షన్ డ్రామా అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. తన చెల్లెలి మరణానికి కారకుడైన వారిని అన్వేషిస్తూ.. పుష్ప అడవుల్లోకి ఎంట్రీ ఇస్తాడట. హీరో అమితంగా ప్రేమించే చెల్లెలి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ ను ఎంపిక చేశారట. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా తన చెల్లెలు మరణించడంతో , వారిపై పగ తీర్చుకోడానికి హీరో.. స్మగ్లింగ్ గ్యాంగ్ తో చేతులు కలుపుతాడట. ఆ టైమ్ లో అతడికి సహాయపడే గిరిజన యువతిగా రష్మికా మందన్న నటిస్తోంది.
బ్రూస్లీ నటించిన హాలీవుడ్ క్లాసిక్ ‘ఎంటర్ ది డ్రాగన్’ స్టోరీ లైన్ ను పోలి ఉండే పుష్ప కథాంశం అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుందని చెబుతున్నారు. ఇక ఇందులో విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఇందులో ఒక అదిరిపోయే ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ను ఎంపికచేశాడట దర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న పుష్ప సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Must Read ;- ‘పుష్ప’ సెట్లోకి అనసూయ… సోషల్ మీడియాలో పోస్ట్