బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు సమాచారం. బ్రిటీష్ షో ‘లూథర్’ రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోంది. ఇందులో ఇద్రిస్ ఆల్ఫా నటించారు. ఓటీటీ సంస్థ డీస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఆయన ఈ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే దీని మీద ఇంకా ఎవరి నుంచీ అధికారిక సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం అజయ్ దేవ్ గణ్ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అస్పష్టంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఆప్సే కిత్నీ బార్ బోలా హై అజయ్ కిస్కో బులా రహే హో? మేరా నామ్ సుదర్శన్ హై.. దువా మెయిన్ యాడ్ రఖ్ నా నామ్ హై సుదర్శన్ ’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ దీన్ని ట్యాగ్ చేసింది. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవలే అభిషేక్ బచ్చన్ నటించిన ‘ది బిగ్ బుల్ ’ కూడా ఓటీటీలో విడుదలైంది. దీన్ని అజయ్ దేవ్ గణ్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పుడు నటుడిగానూ అజయ్ దేవ్ గణ్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ట్రిపుల్ ఆర్ లో ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’, ‘గంగూబాయి కతియావాడిలోనూ నటిస్తున్నాడు.
తన స్వీయ దర్శకత్వంలో ‘మేడే’ రూపొందుతోంది. ఇందులో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఇవి కాకుండా ‘భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ‘లూథర్’ వెబ్ సిరీస్ ను బీబీసీ ఇండియా, అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దీనికి ఫెరారీ కి సవారీ దర్శకుడు రాజేష్ మాపుస్కర్ దర్వకత్వం వహించనున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన ఇతర వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా నటించనున్నట్లు సమాచారం.
Also Read:- ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ లుక్ : స్వాతంత్ర్య సమరసేనాని గా అజయ్ దేవ్ గణ్