బాలయ్య ‘అఖండ’ ప్రభంజనం కొత్త మార్కెట్ కు తెరతీసింది. ఇది ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కకపోయినా ఆయా భాషల్లోకి అనువదించి ఫ్యాన్ ఇండియా లుక్ తెచ్చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై 50 రోజుల పండుగ జరుపుకోవడమే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ జరిగి కొత్త రికార్డుకు తెరతీసింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీతో పాటు ఇతర భాషల్లోకి అనువదించే ప్రక్రియ సాగుతోందని సమాచారం. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సంప్రదింపులు కూడా జరిగాయి. అలా చేయడం కన్నా అనువదించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఓటీటీ వేదిక అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా ఏ సినిమాకి లభించని రికార్డును క్రియేట్ చేసింది. తమిళం, మలయాళం, కన్నడం, ఉత్తరాది ప్రేక్షకులు కూడా సబ్ టైటిల్స్ లో సినిమాని చూశారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్ హక్కులకు భారీగానే ధర లభించింది. తమిళ అనువాదం పూర్తి కావడంతో ఈ జనవరి 28న అక్కడ విడుదల చేస్తున్నారు. మలయాళం, కన్నడంతో పాటు హిందీ హక్కులు తీసుకున్నవారు కూడా అనువాదం చేయడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.
బాలయ్య నటనను చూసిన వారు హిందీలో రీమేక్ చేయడం కన్నా అనువాదం చేస్తేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. అతి త్వరలో హిందీ అఖండ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఇతర భాషల్లోకి అనువదించిన అఖండ కు కూడా మంచి ఆదరణ లభిస్తే బాలయ్య రాబోయే సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో జనం ముందుకు వచ్చే అవకాశం ఉంది. నందమూరి ఫ్యాన్స్ కు ఇది పండగేనని చెప్పాలి. బాలయ్య సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ సాధించడమే ఓ రికార్డు. పైగా కరోనా కాలంలో థియేటర్లలో విడుదలై 50 రోజులు ఆడటం కూడా మరో రికార్డు. తెలుగు సినిమా రంగానికి కూడా కొత్త కళను అఖండ తీసుకు వచ్చింది.