విడుదల ముంగిట టైటిల్ వివాదం రేగడం తరచుగా చూస్తున్నదే. టైటిల్ ఫిక్స్ చేసినప్పుడు.. లేని అభ్యంతరం రిలీజ్ అయ్యేముందే అందరికీ కలుగుతుంటుంది విడ్డూరంగా. ఒక మతం వారి మనోభావాలు దెబ్బతిన్నాయనో.. లేదా ఒక సామాజిక వర్గం వారిని తక్కువ చేశారనో.. ఇలా ప్రతీ విషయానికి రచ్చజరగడం ఇప్పుడు అన్ని భాషా చిత్రాలకూ కామన్ అయిపోయింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’, రణ్ వీర్ సింగ్, దీపికా ‘పద్మావతి’ లాంటి సినిమాల టైటిల్స్ విషయంలో ఇదే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కీ ఇదే సమస్య ఎదురైంది.
తమిళ సూపర్ హిట్ సినిమా ‘కాంచన’ రీమేక్ గా తెరకెక్కిన ‘లక్ష్మి బాంబ్’ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు రాఘవ లారెన్సే తెరకెక్కించాడు. లాక్ డౌన్ లేకపోతే.. ఈ పాటికి ఎప్పుడో థియేటర్స్ లోనే విడుదలయ్యేది సినిమా. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 9 న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సమయంలోనే సినిమాకి టైటిల్ వివాదం చుట్టుముట్టింది. హిందువుల దేవత అయిన లక్ష్మిదేవి పక్కన బాంబ్ అనే పదాన్ని చేర్చి అవమాన పరిచి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హిందూ సంఘాలు ఆరోపించాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బ్యాన్ లక్ష్మీ బాంబ్ అంటూ హాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.
దాంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమా టైటిల్ నుంచి బాంబ్ ను తీసేసి కేవలం ‘లక్ష్మి’ అనే టైటిల్ ను మాత్రమే ఉంచాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో మంచు లక్ష్మి కథానాయికగా ఒక ‘లక్ష్మీ బాంబ్’ సినిమా వచ్చింది. అప్పుడు ఈ తరహా విమర్శలు, అభ్యంతరాలేమీ తలెత్తలేదు. సినిమా ఫ్లాప్ అవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కంటెంట్ లో విషయముంది కాబట్టి.. బాంబ్ లేకపోయినా.. లక్ష్మి సినిమా ఓటీటీలో బాగా పేలుతుందని నమ్మకంగా ఉన్నారు అక్కీ అభిమానులు. మరి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వెయిండ్ అండ్ సీ.