దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం భారీ వ్యయంతో తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 8 నెలలుగా ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఈమధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభించారు చిత్ర యూనిట్. కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళికి అలియా భట్ షాక్ ఇచ్చింది. అలియా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందని, నవంబర్ నుండి శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి రాజమౌళి ప్లాన్ చేసాడని అప్పట్లో టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ ఈ అమ్మడు ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అలియా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘గంగూబాయ్ కథియావాడి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. అసలు ఈ సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారంలోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఇంకో రెండు వారలు పొడిగించారట దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ కారణం చేత అలియా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అవడానికి కొంచెం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అలియా డిసెంబర్ మొదటి వారంలో రాజమౌళి టీంతో కలవనున్నదని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందని తలపట్టుకుంటున్న రాజమౌళికి మరో షాక్ తగిలినట్లు అయ్యింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నారు. ఇప్పటికే అజయ్ దేవ్‌గణ్ పై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని 250కోట్ల భారీ వ్యయంతో డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.











