ప్రముఖ అల్ ఇండియా రేడియో , సినీ సంగీత దర్శకుడు కె ఎస్ చంద్ర శేఖర్ కోవిద్ తో మరణించారు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామము. వీరికి భార్య ముగ్గురు కుమార్తెలు. 1990 లో అల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. ‘ బంట్రోతు భార్య మూవీ తో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశంచేసిన ఈయన సంగీతదర్శకులు చక్రవర్తి, రమేష్ నాయుడు , లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యమకింకరుడు ‘ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు .
ఇంకా బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో భోళాశంకరుడు, ఆత్మ బంధువులు , కంచి కామాక్షి ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత విశాఖపట్నం అల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలందిస్తూ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. కీరవాణి , కోటి మణిశర్మ ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన మరణ వార్తను సినీ రంగంలో కొనసాగుతున్న వారి మేనల్లుడు మహేంద్ర చిత్రపరిశ్రమకు మీడియా కు తెలియజేశారు. చంద్రశేఖర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.











