అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అమలయ్యే జగనన్న సంపూర్ణ పోషణ అసంపూర్ణ పోషణగా మారింది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సంపూర్ణ పోషణ అమలు చేయబడుతోందని ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం.. పథకాన్ని నాసికరంతో నింపి.. అప్రతిష్టపాలు చేస్తున్నారు. వందల కోట్లు ఈ పథకానికి వెచ్చిస్తూ కాంట్రాక్టర్ కు ప్రత్యక్షంగానే దోపిడికి తెరతీస్తున్నారు. ఈ సంపూర్ణ పోషణ పథకం పేరిట గర్బిణీ, బాలింత మహిళలకు పోషకాహారం అందించే లక్ష్యం కాంట్రాక్టర్ల ధన దాహంతో అలక్ష్యానికి గురౌతోంది.
జగనన్న సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి లోని అంగన్ వాడీ కేంద్రం ద్వారా పంపిణి చేసే పాల ప్యాకెట్లు ఉబ్బి.. బాంబు మాదిరిగా పేలితే.. నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బాలింతకు పంపిణీ చేసిన పౌష్టికాహారంలో పాము కళేబరం ప్రత్యక్షమైంది. ఇలా నాణ్యతలేని నాశిరకం పోషకాహారం పంపిణీ చేస్తూ.. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.
తాజాగా సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని పులమతిసడ్లపల్లి అంగన్ వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన పాలప్యాకెట్ల నుంచి తెల్లని పురుగులు బయటకొచ్చాయి. గర్బిణి.., బాలింతల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకం నేడు వారి ఉసురు తీసేలా ఇటువంటి నాణ్యత లోపంతో కూడిన ఆహారాన్ని అందించడం సిగ్గు చేటని తెలుగు దేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలతో చెలగాటమాడే ఈ నాశిరకం ఆహారం పంపిణీ చేయవద్దని మహిళలు సైతం డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే మహిళలు..,చిన్నారుల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం లేకపోలేదని హెచ్చరికలు లేకపోలేదు.