ప్రాంతీయ ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఏకంగా అల్లు అర్జున్ నే రంగంలోకి దించేస్తోంది. దీని కోసం ఓ గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. దీపావళి సమీపిస్తుండటంతో ‘ఆహా’ తన దూకుడును మరింత పెంచేసింది. ఇంతకీ అల్లు అర్జున్ తో ఆహా ఏం చేయబోతోంది అన్నదానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. సమంతా, తమన్నా, పాయల్ రాజ్‌పుత్, సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, పునర్నవి తదితరులతో కూర్చుని చర్చించే కార్యక్రమం ఇదని తెలుస్తోంది.
దీన్ని హోస్ట్ చేసేది ఇంకెవరో కాదు అల్లు అర్జునేనట. మరి ఈ స్టయిలిష్ స్టార్ ఏ స్టయిల్ లో దీన్ని నిర్వహిస్తారో చూడాలి.. ఇంతేనా?.. ఇంతేనా అంటే ఇంకేదో ఉందనే అనుకోవాలి. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వంశీ పైడిపల్లి, పవన్ సాధినేని, సాగర్ కె. చంద్రలు కూడా ఇందులో పాలుపంచుకుంటారని సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ప్రయోగం మొట్టమొదటిసారి అనే చెప్పాలి. ఆహా మరింత ముందుకు తీసుకుపోడానికి ఇంకా ఏమేం చేయాల్సి ఉంటుందో వీరంతా చర్చిస్తారట. కరోనాకు ముందే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు గానీ లాక్ డౌన్ కారణంగా దాన్ని రద్దు చేశారు.
ఎలాంటి కార్యక్రమాలతో వీరు ముందుకొస్తారో చూడాలి. దీపావళి సందర్భంగా ఓ టాక్ షోను కూడా ప్లాన్ చేశారు. ‘తమాషా విత్ హర్ష’ పేరుతో ఈ టాక్ షో నవంబరు 6వ తేదీ నుంచే ప్రారంభమవుతోంది. దీని ప్రోమోను కూడా విడుదల చేశారు. నీహారిక, నవదీప్ లపై రేపటి టాక్ షో ఉంటుంది. ‘నీకు సన్నీ ఇష్టమా బన్నీ ఇష్టమా’అంటూ నీహారికను హర్ష అడిగే తమాషా ప్రశ్న చూస్తుంటేనే ఇందులో ఇలాంటి తమాషా ప్రశ్నలు ఇంకెన్ని ఉంటాయో అనిపిస్తోంది. ఆహా అనేది ప్రాంతీయ ఓటీటీ కాబట్టి దీన్ని మరింత జనరంజకంగా మలచాలనే ప్రయత్నం కనిపిస్తోంది.











