ప్రాంతీయ ఓటీటీ ‘ఆహా’ దీపావళి బొనాంజా అదిరిపోయేలా ఉంది. అతిరథమహారథుల సమక్షంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన భారీ ఈవెంట్ ఎంతో వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, తమన్నా లాంటి తారల తళుకులతో కొత్త అందాలు ఈ ఈవెంట్ కు వచ్చాయి. ఈ వేదికపై తాను నలుగురు దర్శకులతో ఆహా కోసం నాలుగు షోలు రూపొందించ నున్నట్లు ప్రకటించారు. ఆ నలుగురు దర్శకులు ఎవరంటే సుకుమార్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి.
ఎంతోకాలం తర్వాత ఈ వేదికపైకి అందరినీ కలుసుకోవడం తనకు ఆహా అనిపిస్తోందని అర్జున్ అన్నారు. తన జర్నీ ఆహాలో ఎలా ప్రారంభమైందో కూడా చెప్పారు. రెండు మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. తను ఇంటికి ఒంటిగంటకు వచ్చినా, రెండింటికి వచ్చినా తన తండ్రి అల్లు అరవింద్ షోలు చూస్తుండేవారని, అంత టైమ్ వరకు ఎందుకలా పిచ్చిగా షోలు చూస్తున్నావని ప్రశ్నించేవాడినని, వీటి మీద ఆయన ఉన్న ప్యాషన్ ఏంటో ఇన్నళ్లకు అర్థమవుతోందన్నారు.

ఓటీటీ కల్చర్ మీద ఆయనకు ఉన్న మక్కువ, దానికి జూపల్లి ఫ్యామిలీ తోడవడంతో ఆ కల ఇలా నెరవేరిందన్నారు. ఈ ఓటీటీ కల్చర్ వల్ల ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుందన్నారు. ఈ జర్నీలో భాగమైనందుకు దిల్ రాజుకు, విజయ్ దేవర కొండకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో కలసి తను చేసిన యాడ్స్ ను కూడా చూపించారు. ఆహా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి మాట్లాడుతూ తెలుగు వినోద రంగంలో ఆహా అనేది గేమ్ ఛేంజర్ గా మారిందని చెప్పారు.
తన తండ్రి రామేశ్వరరావు ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఇందులో అడుగుపెట్టానని చెప్పారు. త్వరలో విదేశాల్లో సైతం ఆహాను విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటికే కోటి 80 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తో ఆహా రికార్డు సృష్టించిందని, ఇంతలా కొత్త సబ్ స్క్రైబర్స్ పెరగడం తమ బాధ్యతను మరింతగా పెంచుతోందన్నారు. మంచి కంటెంట్ అందరి మన్ననలూ అందుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లిని చీఫ్ కంటెంట్ అడ్వయిజర్ గా నియమిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. ఆహాలో వచ్చే అనేక కొత్త షోల విశేషాలను ఇదే వేదికపై ప్రకటించారు.