పరుచూరి బ్రదర్స్ ప్రస్తావన తేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం అసాధ్యమేనని చెప్పాలి. తెలుగు సినిమా వైభవంలో వారు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు పరంగా తెలుగు కథకు వారు కొత్త రూపాన్ని తెచ్చారు .. సరికొత్త మార్గంలో తెలుగు సినిమాను పరుగులు తీయించారు. కథ చెప్పడంలో పరుచూరి బ్రదర్స్ స్టైల్ వేరు .. వారి కలానికి బలమెక్కువ .. వారి పదాలకు పదునెక్కువ అని తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతిఒక్కరూ చెప్పుకునే మాట. అలాంటి పరుచూరి బ్రదర్స్ .. మెగాస్టార్ కెరియర్లో మెగాహిట్లుగా నిలిచిన ఎన్నో సినిమాలకి పనిచేశారు. తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో ‘అల్లు అరవింద్’ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
*”మేము ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే, అప్పటికి ఇండస్ట్రీలో వున్న పెద్ద నిర్మాతలంతా మాతో రాయించుకున్నారు .. ఒక్క ‘అల్లు అరవింద్‘ గారు తప్ప. మొదటి నుంచి కూడా అల్లు రామలింగయ్యగారి కుటుంబంతో మాకు ఎంతో సాన్నిహిత్యం వుంది .. ఆ కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయ బంధం వుంది. అప్పట్లో అల్లు రామలింగయ్యగారి ఇంటికి దగ్గర్లోనే మేము ఉండేవాళ్లం. అప్పుడప్పుడు ఆయన మా ఇంటికి వస్తుండేవారు. అంతదగ్గరగా వున్నా అల్లు అరవింద్ గారు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలకి మేము రాయలేకపోయాము.
*’అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే, ఆ పక్కనే నేను నటిస్తున్న ‘రక్త కన్నీరు’ షూటింగు కూడా జరుగుతోంది. అప్పుడు అల్లు అరవింద్ గారు అక్కడికి వచ్చారు. ” గోపాలకృష్ణ గారూ .. మీతో నేను ఇంతవరకూ రాయించుకోలేదు. కానీ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాలో చిరంజీవి – వాణిశ్రీ కాంబినేషన్లోని కొన్ని సీన్లను మీరు రాస్తే బాగుంటుందని చిరంజీవిగారు అంటున్నారు” అని చెప్పారు. టైటిల్ కార్డులో మా పేర్లు ఆశించకుండా ఆయనపట్ల గల స్నేహభావంతో ఆ సీన్లను రాసిపెట్టడం జరిగింది. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్లో నాకు ఆయన షీల్డ్ ను కూడా అందజేశారు .. అది ఆయన మంచి మనసుకు నిదర్శనం.
*ఒక శిల్పాన్ని గొప్పగా మలచడం .. మనిషిని అందంగా తీర్చిదిద్దగలగడం అల్లు అరవింద్ గారికి బాగా తెలుసు. చిరంజీవిగారి కెరియర్ తొలినాళ్లలో ఆయన ఎదుగుదల వెనుక అల్లు అరవింద్ గారు వున్నారు. చిరంజీవిగారికి కథ చెప్పగానే, ఆయన అల్లు అరవింద్ గారికి వినిపించమంటారు. ఒకవేళ కథ వినగానే చిరంజీవిగారు ఓకే అంటే, ‘ఇది ఓకేనా?’ అని అల్లు అరవింద్ గారు అడగ్గానే, ఆయనకి గల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవిగారు ఆగిపోయేవారు. ఎందుకంటే నటుడు ఎప్పుడూ ఒక పాత్రలో ఎలా నటించాలా అనే ఆలోచిస్తాడు. కానీ నిర్మాత మాత్రం ఈ కథ మనకి డబ్బులు తెచ్చిపెడుతుందా లేదా? అనేది ఆలోచన చేస్తాడు. అంత అద్భుతంగా తీర్చిదిద్దిన అల్లు అరవింద్ గారిని అభినందించకుండా ఉండలేం” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- చిరూ కథ నచ్చలేదన్నాం .. బన్నీ సినిమా చేయలేకపోయాం











