(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేకప్రతినిధి)
రాజధానిని మూడు ముక్కలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించింది. అయితే మిగిలిన పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. బీజేపీ నుంచి దేశ ప్రధానిగా ఉన్న నరేంధ్రమోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని మూడు ముక్కలైతే… ఆ పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదని బీజేపీ నేతల సుజనాచౌదరి ప్రతి సందర్భంలోనూ బల్లగుద్ది చెబుతూనే ఉన్నారు. ఇక ఆ పార్టీ తాజా మాజీ కన్నా లక్ష్మీనారాయణ తాము 3 రాజధానులకు వ్యతిరేకమని అమరావతి రైతులకు మద్దతు పలికారు. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ మాత్రం 20 కోట్ల జనాభా ఉన్న యూపీకి ఒక రాజధాని ఉంటే 5 కోట్ల జనాభా కూడా లేని ఏపీకి మూడు రాజధానులెందుకని ప్రశ్నిస్తారు. అసలు బీజేపీ నేతలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ పార్టీ అమరావతి రాజధానిపై సింగిల్ స్టాండ్ తీసుకుంటుందని ఎవరు మాత్రం భావిస్తారు.
మూడు ముక్కలాట…
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతి రాజధాని మాత్రమే కొనసాగించాలని 258 రోజులుగా సాగుతున్న ఉద్యమంలో బీజేపీ పాత్ర శూన్యం. అసలు ఏపీలోనే బీజేపీ సింగల్ గా పోటీ చేస్తే కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లేదనేది సత్యం. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఒక శాతం కన్నా తక్కువే. నిజానికి ఇవి నోటా కంటె కూడా తక్కువ. అలాంటి సమయంలో జనసేనతో చేతులు కలిపి 2024లో అధికారంలోకి వస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీరాలు పోతున్నారు. గత ఎన్నికలలో 6 శాతం ఓట్లు తెచ్చుకుంటే జనసేనతో కలవకుంటే గనుక.. తమ పార్టీకి సొంతంగా ఎన్ని సీట్లు రాగలవన్న ధైర్యం ఆయనకు ఉందో లేదో తెలియదు.
ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ల కన్నా ఆ పార్టీ నాయకులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి రోజూ నాలుగు టీవీ లైవుల్లో కుండబద్దలు కొట్టడం తప్ప ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్నది కూడా ఏమీ లేదు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఒత్తిడి తీసుకు వస్తే వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రక్రియను నిలిపివేస్తుంది. కానీ ఏపీ బీజేపీ పెద్దలు ఆ పని చేయరు. రెండు గ్రూపులుగా.. ఒకరు వైసీపీకి కొమ్ముకాస్తున్నట్టుగా.. మరొకరు తెలుగుదేశానికి వత్తాసు పలుకుతున్నట్టుగా మాయమాటలు వల్లిస్తుంటారు.
రాజధానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందా?
అవుననే.. అంటున్నారు రాజధాని రైతులు. ఎందుకంటే ప్రధాని హోదాలో మోడీ శంకుస్థాపన చేసిన దానికే దిక్కులేకుండా పోయినా బీజేపీ నేతలు అమరావతి రాజధానిని సమర్థించడం లేదని వారు మండిపడుపడుతున్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర పెద్దల వద్ద అమరావతి రాజధానిని కాపాడే విషయంలో గట్టిగా మాట్లాడేవారు. కానీ రాష్ట్ర బీజేపీలో ఎవరి దారి వారిదే. ఇక అమరావతి రైతులను ఎవరు పట్టించుకుంటారు. అమరావతికి ద్రోహం చేసిన పార్టీలో బీజేపీది కూడా పెద్దన్న పాత్రేనని చెప్పొచ్చు.
అమరావతి రైతులకు సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం కౌలు, రాజధాని ప్రాంత కూలీలకు ఫించన్లు చెల్లించకపోయినా ఏపీ బీజేపీ నేతలు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఎంతసేపటికీ కేంద్ర బీజేపీ నేతల మెప్పు పొందితే కేంద్రంలో ఏదైనా పదవులు రాకపోతాయా అన్న యావ తప్ప రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలకే లేదు. ఇక రాజధాని రైతునేం పట్టించుకుంటారు.
అమరావతికి ద్రోహం చేసి ఏపీలో బలపడగలరా?
రాజధానికి సకాలంలో నిధులు కేటాయించే విషయంలో మోడీ 1.0 సర్కారు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఇంత సమస్య కూడా వచ్చేది కాదు. అప్పుడు నిధులివ్వలేదు. ఇప్పుడు రాజధాని పోరాటాన్ని సమర్థించడం లేదు. ఈ రకంగా ఒక అమరావతికి చేసిన ద్రోహం వల్ల ఈ ప్రాంతంలో తప్ప.. మిగిలిన రాష్ట్రంలో తాము కోల్పోయేది ఏమీ ఉండదని భాజపా నాయకులు భ్రమిస్తే పొరబాటు. ఎందుకంటే.. ఒక ప్రాంతానికి ద్రోహం చేసిన వారు. ఎవ్వరితోనైనా అవకాశం దొరికితే అలాగే ప్రవర్తిస్తారని ప్రజలు అంచనా వేయగలరు. ఆ కోణంలో చూసినట్లయితే… అమరావతి ద్రోహం వారిని ఎప్పటికీ వెంటాడుతుంటుంది. ఏనాటికి రాష్ట్రంలో వారి పార్టీ బలపడకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమరావతి రాజధాని విషయంలోనే బీజేపీ నేతలు తలోతీరు అన్న చందంగా తయారయ్యారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా, ప్రజల్లో కొంత సానుభూతి ఉండేది. అమరావతికి ఆ పార్టీ మోసం చేయడంతో ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నరు. ఏపీలో బీజేపీ ఓట్ల శాతం చాలా తక్కువ. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీన పడిందనే చెప్పవచ్చు. ఇక బీజేపీ, జనసేనతో కలసి సాధించేది కూడా ఏమీ ఉండదు. అమరావతి రాజధానికి వైసీపీ మూడు ముక్కలు చేస్తే బీజేపీ అమరావతి రాజధాని విషయంలో బీజేపీ నాయకులు మూడు ముక్కలాట ఆడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.