నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్లో వేగం పెంచింది. అమరావతి అభివృద్ధి పనులకు ఊతమిచ్చేలా ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి మరో 15 వేల కోట్ల భారీ రుణం మంజూరు కానుంది. 2 బ్యాంకులు చెరో రూ.7,500 కోట్లను అందించనుండగా, దీనికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నిధులను 2031 వరకు దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో ప్రపంచ బ్యాంకు, ADBలు రూ.15,000 కోట్లను మంజూరు చేయగా, ఆ నిధులతో రాజధానిలో వివిధ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల పురోగతిని బట్టి బ్యాంకులు నిధులను విడుదల చేస్తున్నాయి.
వివిధ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థను నియమించేందుకు CRDA తాజాగా టెండర్ నోటిఫికేష్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న PGMC గడువు 2027 జనవరితో ముగియనుండటంతో, రాజధాని పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా ముందస్తుగానే కొత్త ఏజెన్సీ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. అమరావతిలో మొత్తం రూ.1,00,912 కోట్లతో 141 ప్రాజెక్టులు చేపట్టేందుకు CRDA సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయగా, ప్రస్తుతం రూ.52,362.44 కోట్ల విలువైన 102 పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. మిగతా పనులను రాబోయే రోజుల్లో దశల వారీగా చేపట్టనున్నారు.
ప్రధాన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు మినహా మిగిలిన ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP), హైబ్రిడ్ యాన్యుటీ, డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతుల్లో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కృష్ణానదిపై అమరావతి-ఇబ్రహీంపట్నం మధ్య రూ.2,436 కోట్ల అంచనా వ్యయంతో ఐకానిక్ బ్రిడ్జిని నిర్మిస్తుండగా, దీనికి సంబంధించిన DPR ఇప్పటికే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 40% నిధులు సమకూరుస్తుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన రూ.650 కోట్లతో సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
మరోవైపు రాజధానిలో వరద నివారణ, మౌలిక వసతుల విస్తరణ, సుందరీకరణ పనులకు సైతం ముమ్మర ప్రణాళికలు రూపొందించారు. కొండవీటివాగు, పాలవాగు లైనింగ్ పనులకు రూ.1,496 కోట్లు, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్‌కు రూ.298 కోట్లు, లాం-పెదపరిమి-వైకుంఠపురం రిజర్వాయర్లకు రూ.3,000 నుండి రూ.3,200 కోట్లు వెచ్చించనున్నారు. వీటితో పాటు ఐకానిక్ భవనాల ఫసాడ్ పనులకు రూ.2,540 కోట్లు, ఇంటీరియర్స్ అండ్ ల్యాండ్ స్కేపింగ్‌కు రూ.3,297 కోట్లు, రూ.8,800 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్-1, రూ.2,500 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ప్రాజెక్టు, రూ.818 కోట్లతో కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్, మౌలిక వసతుల రహదారులు, గ్రీన్ బఫర్లు, ఇతర పర్యాటక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం శరవేగంగా పట్టాలెక్కిస్తోంది.











