ఆంధ్రుల రాజధాని అమరావతి పనులు ఇకపై వేగం పుంజుకోనున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరడంతో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు రూ.15 వేల కోట్ల ఆర్థికసాయాన్ని అందించేందుకు ముందుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. పనులు ప్రారంభించడమే ఆలస్యం అందుకు తగినట్లుగా ప్రపంచబ్యాంకు నిధులు విడుదల చేయనుంది.
ఇక తాజాగా టిడ్కో కూడా ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి మంజూరైంది. నిధుల కొరత తీరిపోవడంతో రాజధాని పనులు పట్టాలెక్కనున్నాయి.
అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. అధికారం చేపట్టిన నాటి నుంచే ఇందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాజధాని ప్రాంతంలో పెరిగిన చెట్లు, ముళ్ల పొదలను తొలగించింది. వరద నీటి తొలగింపు కూడా పూర్తయింది. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది. పనులు ప్రారంభించేందుకు అనువుగా మారడంతో కాంట్రాక్ట్ పొందిన నిర్మాణ సంస్థలు ఇక పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది.
2014-19 మధ్య అమరావతి ప్రాంతంలో రాత్రి,పగలనక పనులు జరిగాయి. వేలాది మంది కార్మికులు ఇక్కడ పనులు చేస్తుండేవారు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ నిర్మాణాలు కూడా వేగంగా జరిగాయి. కానీ జగన్ కక్షపూరిత విధానాల కారణంగా గడిచిన ఐదేళ్లు అమరావతికి చీకటి రోజులుగా మారాయి. అమరావతి టార్గెట్‌గా జగన్ చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. కానీ తానోకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు మళ్లీ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ రాజధాని పనుల్లో స్పీడ్ పెంచింది. ఐదేళ్లలో రాజధాని ప్రాంతానికి ఓ రూపు ఇచ్చే విధంగా ముందుకు సాగుతోంది.